యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా విడుదల ఇంకెంతో దూరంలో లేదు. అక్టోబరులో వచ్చేస్తుంది. ఇప్పటికి హీరో ఫస్ట్‌లుక్ ఒకటి, హీరో హీరోయిన్లు కనిపించి కనిపించనట్టు ఉండే టైటిల్ మోషన్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. తాపీగా ఈ నెల 15న టీజర్ విడుదల చేస్తామని గురువారం సాయంత్రం సెలవిచ్చారు. ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా సైట్స్‌లో అభిమానులు ఎంత అడిగినా చిన్న ముక్క అంటే చిన్న ముక్క కూడా చెప్పలేదు. ఓ పక్క వచ్చే ఏడాది విడుదల కానున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా గురించి వారం రోజులుగా హడావుడి చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు తమకు శుభవార్త ఎప్పుడు చెబుతారా? అని ఎదురుచూస్తున్నారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ టీజర్ న్యూస్ ముందుగా చెబితే అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేసేవారే. పది పదిహేను రోజుల ముందు ఇటువంటి వార్తలు చెబితే… అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. సాధారణంగా జరుగుతున్న తంతే ఇది. దీనివల్ల సినిమాకి బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. ఈ సంగతి ఎన్టీఆర్‌కీ తెలుసు. అయినా సరే… టీజర్ న్యూస్ మహేశ్ బర్త్‌డే సాయంత్రం వరకూ బయటకు రాకుండా చూశాడు. ఒకవేళ ముందువస్తే… సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తుంది. అది ఇష్టం లేకే మహేశ్ ‘మహర్షి’ హడావుడి పూర్తయ్యే వరకూ ఎదురు చూశాడట! ఇదీ మహేశ్–ఎన్టీఆర్ మధ్య అండర్స్టాండింగ్! వాళ్ల మధ్య దోస్తీకి చిన్న ఎగ్జాంపుల్! ఇటీవల మహేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మధ్య స్నేహం ఎంత బలపడుతుందో తరచూ బయటకు వస్తున్న ఫొటోల్లో చూస్తూనే ఉన్నాం!!