ఓ బడా హీరో సినిమా రెడీ అవుతోందంటే.. టైటిల్ ఏంటా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడడం సహజం. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయితే ఆ ఆత్రుత ఇంకా ఎక్కువగా ఉంటుంది. మూడు నాలుగు టైటిళ్లు ప్రచారంలోకి రావడం, జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం, చివరికి టైటిల్ ఖరారు కావడం… సాధారణంగా టైటిల్ ని బయటకు తీసుకొచ్చే పద్ధతి ఇది. కానీ మహేష్ 25వ సినిమా కోసం ఓ కొత్త ఆలోచన చేసింది చిత్రబృందం. రోజుకో ఇంగ్లిష్ లెటర్ని విడుదల చేస్తూ.. ఆసక్తిని పెంచేద్దాం అనుకుంది. మూడు రోజులు గడిచేసరికి ‘రిషి’ అనే టైటిల్ అని బయటకు లీకైపోయింది. మూడ్రోజులకే టైటిల్ ఏమిటో తెలిసిపోతుంది అనుకున్నప్పుడు ఇలాంటి పబ్లిసిటీ ఎత్తుగడ ఎందుకు వేశారో అర్థం కావడం లేదు. రేపొద్దుట ‘మహేష్ 25 వ సినిమా పేరు రిషి’ అని ఎనౌన్స్ చేసినా.. సూపర్ స్టార్ అభిమానుల్లో కిక్ ఉండదు. ఎందుకంటే ఆ టైటిల్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి. ఇప్పటి వరకూ మహేష్ సినిమా టైటిల్ ఏమై ఉంటుందన్నది ఎవ్వరికీ తెలీదు. ఆ సీక్రెసీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న చిత్రబృందం ఒక్కసారిగా.. ప్రమోషన్ లోపంతో టైటిల్‌ని బయటపెట్టేసుకుంది. మహేష్ 25వ సినిమా కాబట్టి.. ప్రమోషన్ని కూడా కొత్త తరహాలో ఆలోచించాలనుకోవడం బాగుంది. కానీ… ఈ తరహా ప్రమోషన్ ఇలాంటి బడా స్టార్ సినిమాలకు ఏమాత్రం నప్పదు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రిషి అనే టైటిల్ ఫిల్మ్‌నగర్ అంతా పాకేసింది. టైటిల్ విషయంలో మహేష్ అభిమానుల్లో మళ్లీ ఆసక్తిని పెంచాలంటే మాత్రం… ఆ టైటిల్‌ని పక్కన పెట్టి, ఓ అందమైన అద్భుతమైన టైటిల్ ప్రకటించడం మినహా మరో మార్గం లేదు.