మహేష్ బాబు – రాజమౌళి కాంబో… సినిమా ప్రపంచం మొత్తం దృష్టీ ఈ కాంబోపైనే ఉంది. ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు రానివ్వడం లేదు రాజమౌళి. ఆఖరికి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్సయ్యిందన్న విషయాన్ని కూడా మీడియాకు చెప్పలేదు. కాకపోతే.. ఇన్ సైడ్ వర్గాల ద్వారా ఒకొక్క విషయం బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించిన ఓ హింట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ `రుద్ర`గా కనిపిస్తాడట. అది తన క్యారెక్టర్ పేరు.
‘గుంటూరు కారం’లో రమణ, ‘ఖలేజా’లో సీతారామరాజు, ‘అతడు’లో పార్థు, ‘పోకిరి’లో.. పండు… ఇలా మహేష్ సినిమా టైటిల్సే కాదు.. తన క్యారెక్టర్ పేరులోనూ ఓ యునిక్నెస్ వుంది. మరి ‘రుద్ర’ని మహేష్ ఫ్యాన్స్ ఎంత వరకూ ఓన్ చేసుకొంటారో చూడాలి. ఇటీవల హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజుల పాటు షూట్ చేశారు. ఓ కీలకమైన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ షూట్ లో మహేష్, ప్రియాంకా చోప్రాతో పాటు నానా పటేకర్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నానా పటేకర్ మహేష్ తండ్రిగా నటించనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా టీమ్ బయటకు రానివ్వలేదు. కొత్త షెడ్యూల్ ఒరిస్సాలో ప్రారంభమైందని సమాచారం. అక్కడ మరో 15 రోజుల పాటు షూటింగ్ జరగబోతోందట. ఈ చిత్రం కోసం ‘గరుడ’ అనే పేరు పరిశీలనలో వుంది. అయితే పాన్ వరల్డ్ సినిమా కాబట్టి, ఇంగ్లీష్ టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.