మహేశ్‌బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఐదు రోజులు మాత్రమే మిగిలుంది. అదేనండీ… ఆయన హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా మహేశ్ కనిపించనున్నారు. ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి నాలుగేళ్లు అవుతోంది. సినిమాలో మాత్రం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూపించడానికి కారణం ఏంటో తెలుసా? ‘చంద్రబాబు, కేసీఆర్‌లతో మహేశ్‌కి పోలిక ఎందుకని’ దర్శకుడు కొరటాల భావించడమే.
మహేశ్‌బాబుని తెలంగాణ ముఖ్యమంత్రిగా చూపిస్తే ప్రేక్షకులు కేసీఆర్ అనుకునే అవకాశం వుంది. అదే ఆంధ్ర ముఖ్యమంత్రిగా చూపిస్తే చంద్రబాబునాయుడు అనుకొనే ప్రమాదం ఉంది. పోలికలు వస్తాయి. ఎందుకొచ్చిన తలనొప్పి. వివాదాల జోలికి పోకూడదనే ఉద్దేశంతో రాష్ట్రాలుగా వేరుపడక ముందు 2014కు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ నేపథ్యాన్ని సినిమాకు ఎంపిక చేసుకున్నామని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. సినిమా కథంతా కల్పితమే అని ఆయన చెబుతున్నారు.