శ్రీమంతుడుతో సందేశాల బాట పట్టాడు మహేష్‌బాబు. గ్రామాలని దత్తత తీసుకోవాలని పిలుపు ఇచ్చాడు. ఆ ఊపు కొంతకాలం తెలుగు నాట కనిపించింది కూడా. అందులోనే కాస్త హీరోయిజం కూడా చూపించేసి సినిమాని హిట్ చేసేశాడు మహేష్. ఆ తరవాత చేసిన భరత్ అనే నేను కూడా మెసేజీల బాట పట్టింది. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, పరిపాలన ఎలా సాగాలో ఆ సినిమాలో చెప్పారు. బొమ్మ మళ్లీ హిట్టు. మహర్షిలో కూడా అంతే. వీకెండ్ వ్యవసాయం, స్నేహితుడికి ఇచ్చిన మాట.. ఇలా సాగిందా సినిమా. అందులోనే మహేష్ ఫ్యాన్స్ కోరుకునే విషయాలన్నీ మేళవించేశారు. మళ్లీ సూపర్ హిట్టు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులోనూ కాస్తో కూస్తో సందేశం ఉండబోతోందన్న విషయం ప్రచార చిత్రాలు చూస్తే అర్థమైపోతోంది.
అయితే ఇక మీదట ఇలా సందేశాల కథలకు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నాడు మహేష్. ఈ విషయం మీడియా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. సందేశాలున్న కథలు చెస్తే, తెలియకుండానే క్యారెక్టర్లో ఓ సీరియస్‌నెస్ వచ్చేస్తోందని మహేష్ అభిప్రాయపడ్డాడు. ఎంటర్టైన్ చేసే వీలు లేకుండా పోతోందని, అందుకే కొంతకాలం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. ఈమధ్య ఫ్యాన్స్‌ని ఎక్కడ కలిసినా, మాస్ సినిమా చేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని, భరత్ అనే నేను, మహర్షి లాంటి కథలు ఎంచుకుంటున్నప్పుడు పనిగట్టుకుని మాస్ సీన్లు చేయలేమని, అందుకే ఆ తరహా కథలకు కొంత విరామం ఇవ్వబోతున్నట్టు మహేష్ చెబుతున్నాడు. అంటే.. మహేష్ దృష్టి ఇప్పుడు పోకిరి లాంటి కమర్షియల్ సినిమాలపై పడిందన్నమాట. ఈ జోరు ఎన్ని సినిమాల వరకో చూడాలి.