బ్రహ్మౌత్సవం బోరోత్సవం అని ఎందుకు ముద్ర వేయించుకుంది? తెలుసుకోవడం కోసం ఏడు తరాలను వెతికే ఆ చిత్ర కథానాయకుడిలాగే నేను ఆలస్యంగా వెళ్లి చూశాను. అన్నిటికన్నా పెద్ద లోపం ఆ చిత్రం కృత్రిమతం కూరినదిగా వుండటం. తెరపట్టనంత మంది తారలు, వారందరి మధ్య సూపర్‌స్టార్‌ను, ఇద్దరో ముగ్గురో గ్లామర్ హీరోయిన్లను బోలెడు సెంటిమెంటునూ పెట్టేస్తే హిట్ కాకపోతుందా అన్న భ్రమోత్సవమే బ్రహ్మౌత్సవం.
చిత్రం మొదలైనప్పటినుంచి ఒకటే సెంటిమెంట్లు, జాతరలను తలపించే వేడుకలు, మాటిమాటికి ఒకరిని చూసి ఒకరు మురిసిపోవడాలు.. ఇన్నిటి మధ్య సహజంగా వున్నది నెగిటివ్ రోల్ అనుకున్న రావు రమేష్ ఒక్కరే. అతన్ని సర్దుబాటు చేసే భార్య జయసుధ, వారి అమ్మాయి ప్రణీత. సహజత్వం స్పష్టత వున్న పాత్రలివే. తండ్రి చంటబ్బారుపాత్రలో సత్యరాజ్ మహేష్ మాటలు గుమ్మరించేయడం భరించలేనంత ఎక్కువగా వుంటుంది. దర్శకుడు అనుకున్నది సన్నివేశాల ద్వారా కథాగమనం ద్వారా చెప్పాలి. రావు రమేష్ ఈర్ష్య తప్ప తక్కిందంతా ఫీల్‌గుడ్ అన్నట్టు తీయడంతో చూడటానికి ఏమీ లేకుండా పోయింది. అతని కూతురు భార్యతో సహా ఎవరూ ఎలాగూ తనను బలపర్చరు. ఇక సమస్యేముంటుంది? అలాటి వ్యక్తి ఏదో అన్నాడని అంతటి చంటబ్బాయి గుండెపగలి చనిపోవడం.. ఆ తర్వాత కుమారుడు ఏడు తరాలను చూస్తానంటూ బయిలుదేరడం అంతా అసహజమే. పోనీ అదైనా క్రమ పద్దతిలో వుందా అంటే నాగపూర్ అత్తయ్య ఎపిసోడ్ తప్ప మిగిలినవన్నీ అతుకులే. అందరినీ కలుసుకుని వచ్చాక మామయ్య పిలవని పెళ్లికి వెళ్లి మహేష్ మళ్లీ లెక్చరు పీకడం.. అతను కరిగి కాళ్లదగ్గరికి రావడం పిల్లల కథలాగే! చాలామంది మొదటి సగం బాగుంది రెండో సగం బోరు అన్నారు గాని నాకైతే రెండో సగమే కొంత బెటరనిపించింది.
సత్యరాజ్ ఏమీ చేయకపోయినా మిర్చిలో తండ్రి పాత్ర సహజంగా వుండింది. దాన్ని సీతమ్మ వాకిట్లో.. ప్రకాశ్ రాజ్‌ను మేళవించి రూపొందించిన చంటబ్బాయి పాత్ర అస్సలు జీవం కోల్పోయింది. శ్రీకాంత్ సీతమ్మ వాకిట్లో చిత్రంలో కూడా ఇలాటి అసహజత్వమే చూపించాడు. దాంట్లోనూ కథ తక్కువ, ఇదే రావు రమేష్ ఈర్శ్య తప్ప మరో సమస్య లేదు. మహేష్ బాబు దాంట్లో తండ్రిని అన్నను కూడా తప్పు చెప్పగల వాస్తవిక వాది. దీంట్లో స్పష్టత లేని నాన్న భక్తుడు మాత్రమే. సన్నివేశాల్లోనూ పాటల్లోనూ కూడా ఆయన స్టార్‌డమ్‌ను అతిగా వాడుకోవాలనుకుని రేంజి తగ్గించేశారనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో ..చిత్రంలోనూ అనుకున్న సందేశం చేరవేయడానికి దర్శకుడు కృత్రిమ మార్గాన్నే ఎంచుకున్నారు. ప్రకాశ్ రాజ్ కుటుంబం మంచితనం అవతలివారికి తెలియడానికి రెండు యాక్సిడెంట్లు జొప్పించడం చాలా అసహజంగా వుంటుంది. అయినా తారాబలం, ముఖ్యంగా అన్న దమ్ముల వెంకటేష్ మహేష్‌ల అనుబంధాలు ఆవేశాలు, సీతగా వేసిన అంజలి నటన రూపం అన్నీ కలిపి నిండుదనం తెచ్చాయి. పాటలూ మాటలూ ఇంతకంటే పొదుపుగా పదునుగా నడుస్తాయి. మొదటి చిత్రం కొత్త బంగారు లోకం కూడా హఠాత్తుగా తండ్రి మరణం సంభవించి కథ మలుపు తిప్పడంలో బలహీనత వుంటుంది. చిన్న పిల్లల పరిధి మించిన మాటలుంటాయి.
నలుగురితో వుండటమంటే మన బంధువులు ఎక్కడున్నారో వెతుక్కుని మరీ వారితో వుండటం కాదు. ఈ సందేశాన్ని మరికొంచెం లాగితే బంధుప్రీతిగా మారిపోతుంది. మానవాసక్తి కొద్ది అన్వేషణ చేయొచ్చు గాని మన చుట్టూ వున్నవారే మన వారనుకోవాలి. అన్యాపదేశంగా దర్శకుడిలో ఆ భావన తొంగిచూస్తుంది.ముగ్గురు అమ్మాయిలనూ మూడు లక్షణాలకు ప్రతీకలుగా పెట్టారు గాని ముగ్గురూ హీరో ముందు తేలిపోతుంటారు. తెలిసిందే చెప్పడం కోసం తెలిసిన పద్ధతిలో సినిమా తీసి మరీ ఎక్కువగా చెప్పించడం – చేయడానికేమీ లేకపోవడం, ఎవరు ఏమిటో కూడా ప్రేక్షకులకేగాక బహుశా పాత్రలకు కూడా తెలియనంత గజిబిజి..అంత గొప్ప తండ్రి పోతే లండన్‌లోని కూతురు ఎందుకు రాలేదో రాదో అర్థం కాదు. నిజానికి సంభాషణలు కూడా చాలా చోట్ల అర్థం కావు. మంచినటుడు రావు గోపాలరావు క్యారికేచర్‌తో చేసిన ప్రయత్నం కూడా తేలిపోయింది. ఇంతకన్నా గీతాంజలి సినిమాలో వారి సంబంధాన్ని చూపించిన తీరు బావుంటుంది.
ఖచ్చితంగా చెప్పలేకపోయినా మరో అంశం కూడా వుంది. సీతమ్మ వాకిట్లొ చిత్రం జరిగేది గోదావరి జిల్లాల్లో అయినా హైదరాబాద్ తరచూ తగులుతుంటుంది. ఈ చిత్రం పూర్తిగా విజయవాడ ఆ పరిసరాలను చూపిస్తుంటుంది. ఏడు తరాల కోసం దేశమంతా తిరిగినప్పుడు కూడా తెలంగాణ జిల్లాలను చూపించలేదు. మన చిత్రాల వసూళ్లలో సగానికిపైగా హైదరాబాదులో రావలసిందే. దానికే చోటు లేకుండా పోతే ప్రేక్షకులకు స్వంతమనే భావన కలగదని కూడా గుర్తించాలి. .
పోకిరీ దూకుడు బిజినెస్మ్యాన్లు విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయి. అతడుతో పోలిస్తే అవన్నీ పటిష్టమైన కథా నిర్మాణంతో సాగినవేమీ కాదు. బాగుండటం అంటే బాగా వుండటం కాదు, నలుగురితో వుండటం అని అత్తారింటికి దారేదిలో హీరో చెప్పేసందేశం(నిజానికి అత్తారింటికి లోనూ బ్రహ్మానందం ఎపిసోడ్ బోరు కొట్టిస్తుంది గాని ఎక్కువ సేపుండదు) బ్రహ్మౌత్సవం చంటబ్బాయి జీవితాశయం కూడా ఇంచుమించుఅదే. మరి ఎంత పకడ్బందీగా తీసి వుండాలి? మహేష్ బాబు సూపర్‌స్టార్ హౌదాను కాపాడుకోవాలంటే కథల ఎంపిక చిత్రణలో మరింత జాగ్రత్త వహించవలసి వుంది.
సందేశం ఇవ్వాలంటే టెలిగ్రాం పంపించు, సినిమా తీయడమెందుకు అనేవాడట చక్రపాణి. సందేశం ఎంతగొప్పదైనా సన్నివేశాలు సంభాషణలు సంబంధాలు అన్నీ అమరితేనే విజయం. ఈ సత్యాన్ని మన దర్శకులు హీరోలు గ్రహింతురు గాక.
ఇవన్నీ ఒక కమర్షియల్ చిత్రం పరిధిలో రాసినవే గనక వాస్తవిక విమర్శలు కూడా ఆ కోణంలోనే పరిశీలించాలని మనవి.