మహేష్ బాబు కి చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. అందులో ఒకటి.. సినిమా ప్రారంభోత్సవం రోజున మహేష్ వెళ్లడు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడు. నేరుగా సెట్స్ లోకి వెళ్లిపోవడమే. దాదాపు పదిహేనేళ్లుగా ఇదే జరుగుతోంది. మహేష్ లేకుండానే క్లాప్ కొట్టేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఆ తరవాత మహేష్ సెట్లో జాయిన్ అవుతాడు.
కానీ రాజమౌళి సినిమా కోసం మాత్రం ఆ సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. మహేష్ – రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సెంటిమెంట్ ప్రకారం మహేష్ రాడనుకొన్నారంతా. కానీ.. అందరికీ షాక్ ఇస్తూ, మహేష్ ఈ ఈవెంట్ లో పాలు పంచుకొన్నాడు. షూటింగ్ ఎప్పుడన్నది ఇంకా తెలీలేదు. కాకపోతే సంక్రాంతి తరవాత మహేష్ పూర్తి స్థాయిలో చిత్రబృందానికి అందుబాటులో ఉంటానని చెప్పాడట. సంక్రాంతి తరవాత షూటింగ్ ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చు. కథానాయికగా ప్రియాంకా చోప్రాని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రతినాయకుడిగా ఫృథ్వీరాజ్ కనిపించనున్నాడని సమాచారం. అయితే చిత్రబృందం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
రాజమౌళి కోసం మహేష్ సెంటిమెంట్ బ్రేక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఏమైనా చేస్తాడని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే.. ఆయన చెప్పింది వినాల్సిందే. దానికి సూపర్ స్టార్, మెగాస్టార్ తేడా లేదు. ప్రస్తుతం అదే జరుగుతోంది.