మహేష్ బాబు – రాజమౌళి కాంబో గురించి ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సినిమా రికార్డుల్ని షేక్ చేసే సత్తా ఈ కాంబోకి ఉంది. ఈ సినిమాకు సంబంధించి, ఒక్క చిన్న అప్ డేట్ కూడా బయటకు రాలేదు. కాకపోతే అనధికారికంగా చాలా సమాచారం బయట జోరుగా తిరుగుతోంది. ఇదో అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని, అటవీ నేపథ్యంలో ఎక్కువ శాతం షూటింగ్ జరుగుతుందని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రతినాయకుడు విషయంలో రాజమౌళి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, ఆ పాత్రలో విక్రమ్ ఎంపిక దాదాపుగా ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చిత్రబృందం స్పందించలేదు.
ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని, ఓ పాత్రలో నెగిటీవ్ లక్షణాలూ ఉంటాయని చెప్పుకొంటున్నారు. మహేష్ ఇప్పటి వరకూ డ్యూయల్ రోల్ చేయలేదు. కాబట్టి మహేష్ వరకూ ఇది కొత్త అంశమే. నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తే… తప్పకుండా అదో అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే ఈవార్తల్లో నిజమెంతో తెలియాల్సివుంది. మహేష్ ను రాజమౌళి కొత్తగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారన్నది నిజం. మహేష్ గెటప్ కూడా కొత్తగా ఉండబోతోంది. అందుకోసం విదేశీ మేకప్ నిపుణులు పనిచేయబోతున్నారు. ఇప్పటికే మహేష్ కోసం కొన్ని ప్రత్యేకమైన స్కెచ్‌లు సిద్ధం చేశారు. వాటిలో ఓ గెటప్ ఫైనల్ చేసి, దానికి తగ్గట్టుగా మహేష్‌ని మేకొవర్ చేయబోతున్నారు. ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కాన్సెప్ట్ వీడియో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా, లేదా? అనే విషయం ఆ కాన్సెప్ట్ వీడియోతోనే అర్థమైపోయే ఛాన్సుంది. కాబట్టి… ఈ డబుల్ ట్రీట్ నిజమో కాదో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.