చలపతిరావు నోటి దుసురు..అనాలోచిత వ్యాఖ్య అటు తిరిగి ఇటు తిరిగి చాలామందిని వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. ఆఖరికి `అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం` అనే డైలాగ్‌ని సినిమాలో ఉంచాలా? తీసేయాలా? అనే విషయంలో చిత్రబృందం సీరియెస్ గా ఆలోచిస్తోందంటే – చలపతిరావు ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ఇప్పుడు… ఈ విషయంలో సమంత వైఖరిని కూడా వేలెత్తి చూపిస్తున్నారంతా. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే.. సమంతని ఓ రేంజ్లో నిలదీస్తున్నారు.
వన్ నేనొక్కడినే పోస్టర్ విషయంలో సమంత ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. నిజానికి అంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే అందులో ఏం కనిపించదు. కానీ సమంత ఆశ్చర్యకరమైన రీతిలో సీరియెస్ అయ్యింది. అప్పటి నుంచి సమంత ఎప్పుడు దొరుకుతుందా, అని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చలపతిరావు పుణ్యాన ఇప్పుడు సమంత భలే దొరికేసింది. చలపతిరావు అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడితే.. సినీ లోకం అంతా ఘాటుగా స్పందించింది. చలపతిరావుని నిలదీసింది. కానీ సమంత ఏం చేస్తోంది? `అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం` అనే చైతూ డైలాగ్‌ని ట్వీట్ చేసి `అది నా కోసం కాదు` అని అభిమానులతో పంచుకొన్న సమంతకి ఆ డైలాగ్‌ని వక్రీకరిస్తూ చలపతిరావు అన్న మాటలు వినపడలేదా? ఇప్పుడు సమంత నోరు మెదపదే. అందులో హీరో తనకు కాబోయే భర్త అనా,
లేదంటే మామ గారు తీస్తున్న సినిమా అనా?? అనేది మహేష్ ఫ్యాన్స్ అడుగుతున్న లా పాయింట్. వాళ్లు అడిగిన దానిలో రీజన్ ఉంది. లాజిక్ ఉంది. మరి సమంత దగ్గర సమాధానం ఉందా?