భారీ అంచనాల మధ్య బ్రహ్మోత్సవం విడుదలైంది. ఓవర్సీస్లో ప్రీమియర్స్ పడినప్పటి నుంచీ ఈసినిమాపై ఒక్కటే టాక్ `బోరింగ్ బ్రహ్మోత్సవం` అంటూ పెదవి విరుస్తున్నారంతా. ఈ సినిమాలో అన్నీ ఉన్నా…. ఏదో వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని వేళ్లూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల వైపే చూపిస్తున్నాయి. ఇంత పెద్ద స్టార్.. అంతమంది భారీ తారాగణం, టెక్నికల్ గా హై స్టాండర్స్డ్ ఉండి కూడా.. ఓ సీరియల్ లాంటి సినిమా తీశాడంటూ శ్రీకాంత్‌ని కార్నర్ చేస్తున్నారు. స్టార్లతో సినిమాలు తీసే దర్శకులకు వచ్చే చిక్కే ఇది. సినిమా బాగుంటే హీరోని పొగుడుతారు.. బాగోకపోతే దర్శకుడ్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఆ నిందలన్నీ భరించాల్సింది శ్రీకాంత్ అడ్డాలనే.
ఎత్తుకొన్న పాయింట్ బాగానే ఉంది గానీ… దాన్ని సరిగా ప్రజెంట్ చేయలేకపోయాడు శ్రీకాంత్. ప్రతి సీనూ సాగదీత ధోరణిలో ఉండడం, కొన్ని సీన్లలకు లింకులు లేకపోవడం, అతుకుల బొంతలా తయారవ్వడంతో ఇదంతా దర్శకుడి మహిమే అని మహేష్ అభిమానులు కూడా ఆక్రోశిస్తున్నారు. ఈ సినిమా తరవాత స్టార్ దర్శకుల జాబితాలో తన పేరు చూసుకోవాలనుకొన్నాడు శ్రీకాంత్. ఆ ఆశలన్నీ ఆడియాశలైనట్టే. దానికి తోడు మహేష్ అభిమానులు అస్త్రాలను కాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం.. శ్రీకాంత్ అడ్డాల. ఈసారి అడ్డంగా దొరికిపోయాడు.