భారీ అంచనాలతో విడుదలైన సర్కారు వారి పాటకు… తొలి రోజే డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై భారీ ట్రోలింగ్ మొదలైంది. సినిమా బాగాలేదన్న ప్రచారం కావాలని చేస్తున్నారని, పని గట్టుకుని సినిమాని ఫ్లాప్ చేసే ప్రయత్నాలు చేస్తోందని నిర్మాతలు లబో దిబోమంటున్నారు. దీనికి గల కారణాల్ని లోతుగా విశ్లేషిస్తే.. ఈ నెగిటీవ్ టాక్‌కి ఓ రకంగా మహేష్ ఫ్యాన్సే కారణమన్న నిజం తేటతెల్లమవుతోంది.
అదెలాగంటే… మిగిలిన హీరోల సినిమాలు వచ్చినప్పుడు మహేష్ ఫ్యాన్స్ నెగిటీవ్ కామెంట్స్ తో విరుచుకుపడేవాళ్లు. వాళ్ల ట్రోలింగ్ మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా పవన్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలంటే… విపరీతంగా ట్రోలింగ్ చేసేవారు. ఫ్లాప్ అయితే.. ఆ ట్రోలింగ్ దారుణంగా ఉండేది. అందుకే మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా.. మహేష్ ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురు చూశారు. ఇప్పుడు సర్కారు వారి పాటకు నెగిటీవ్ టాక్ రాగానే… వాళ్లు విజృంభించేశారు. మిగిలిన హీరోల అభిమానులంతా ఏకమై… `సర్కారు..`ని వేసుకోవడం మొదలెట్టారు. ఓ వైపు మహేష్ ఫ్యాన్స్ తమ సినిమాని ఎంతగా లాగాలని ప్రయత్నించినా వాళ్ల బలం సరిపోవడం లేదు. దాంతో.. ఈ సినిమాపై నెగిటీవ్ ట్రోలింగ్ ఎక్కువగా డామినేట్ చేసేసింది. అది కలక్షన్ల రూపంలోనూ కనిపిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ మిగిలిన సినిమాలకు, వాళ్ల అభిమానులకూ కాస్త గౌరవం ఇచ్చినా – `సర్కారు`పై ఇంత ట్రోలింగ్ జరిగేదే కాదు. ఈ విషయాన్ని మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికైనా గుర్తించుకుంటే బాగుంటుంది.