సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ముఖ్యంగా మహేష్ బాబు కుటుంబానికి ఇది పెద్ద లోటు. కృష్ణ వెళ్ళిపోవడంతో పెద్ద దిక్కుని కోల్పోయారు మహేష్. 2022 మహేశ్ బాబు జీవితంలో చాలా చేదు అనుభవాన్ని మిగిల్చింది. మహేష్ కి అన్నయ్య రమేష్ అంటే చాలా ప్రేమ. ఈ ఏడాదే కరోనా సమయంలోనే లివర్ ఫెయిల్యూర్తో రమేష్ బాబు మరణించారు. తర్వాత మహేష్ తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 28న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. తల్లిపోయిన బాధ నుండి ఇంకా తేరుకోకముందే తండ్రి కృష్ణ మరణించడం మహేష్ ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
తండ్రి కృష్ణ అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. ఏ వేదికలో మాట్లాడిన తండ్రి పేరు ప్రస్తావనలోకి తీసుకొస్తారు. మహేష్ కి ఇష్టమైన హీరో కూడా కృష్ణే. మహేష్ సినిమాల విషయంలో కూడా కృష్ణ ఎంతో శ్రద్ధగా వుండేవారు. మహేష్ సినిమా బాక్సాఫీసు వసూళ్ళన్నీ కృష్ణ నోటి లెక్కల్లా చెప్పేవారు. ఫ్యామిలీ అంటే కృష్ణకి ఎంతో ఇష్టం. పండగలకు, వారాంతాలు అందరినీ ఒకదగ్గరికి చేర్చేవారు కృష్ణ. ఏ పండగొచ్చినా,ఎవరి పుట్టిన రోజైనా అందరినీ తన ఇంటికి పిలిచి.. కలిసి భోజనం చేయడం ఓ సంప్రదాయంలా మార్చారు కృష్ణ. ఇప్పుడలా కుటుంబాన్ని ఒక్కటి చేసే పెద్దదిక్కు లేకపోవడం మహేష్ కి పూడ్చలేని లోటు.