సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్నాడు మహేష్‌బాబు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకొన్నాడు. మరి మహేష్ తరవాత ఆ వారసత్వాన్ని అందుకొనేది ఎవరు? ఇంకెవరు.. ఘట్టమనేని గౌతమ్. మహేష్ గారాల తనయుడు ‘వన్ – నేనొక్కడినే’లో చిన్నప్పటి మహేష్ గా కనిపించి అభిమానుల్ని అలరించాడు. మహేష్, గౌతమ్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. లాజిక్‌గా ఆలోచిస్తే… మహేష్, గౌతమ్ ఒకే ఫ్రేములో కనిపించకూడదు. కానీ సుకుమార్ ఆ లాజిక్‌ని మరిపించేలా మ్యాజిక్ చేశాడు. మహేష్ అభిమానులు ఖుషీ అయ్యారు.
ఆ తరవాత గౌతమ్ మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. తనకు నటించే ఆలోచనలు ఉన్నాయా? ఉంటే మళ్లీ ఎప్పుడు తెరపై చూస్తాం? అనేది మహేష్ అభిమానుల్ని తొలుస్తున్న ప్రశ్నలు. గౌతమ్ ప్రస్తుతం చదువుకొంటున్నాడు. విదేశాల్లో ప్లస్ టూ విద్యని ముగించాడు. త్వరలోనే అక్కడే ఉన్నత విద్యని అభ్యసిస్తాడు. అయితే పనిలో పనిగా అక్కడే నటనలోనూ శిక్షణ ఇప్పించాలని మహేష్ భావిస్తున్నాడట. అందుకు తగిన వసతులు ఎక్కడ ఉన్నాయో ప్రస్తుతం తెలుసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడని టాక్. ప్రస్తుతం గౌతమ్ వయసు 17 ఏళ్లు మాత్రమే. హీరో అవ్వాలgటే మరో నాలుగైదేళ్లయినా ఆగాలి. ఈలోగా అన్ని రకాలుగానూ తర్ఫీదు పొందేంత టైమ్ ఉంది. మధ్యమధ్యలో నాన్న సినిమాల్లో తళుక్కున మెరిసే అవకాశాలూ లేకపోలేదు. సితార మాత్రం తెరపై కనిపించే ఛాన్స్ తక్కువగానే ఉంది. తనని సింగర్‌గా చూడాలని నమ్రత ఆశ పడుతోంది. సంగీతంలో సితార శిక్షణ తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.