మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి తొలి పాట ‘మైండు బ్లాకు’ నిన్ననే విడుదలైంది. ర్యాప్ స్టైల్లో సాగే మాస్ గీతమిది. హుషారుగానే ఉంది. కాకపోతే… ఈ పాటని సోషల్ మీడియాలో ఇష్టంవచ్చినట్టు ఆడుకుంటున్నారు. విపరీతంగా ట్రోల్ అవుతోంది. రిలిక్స్మీద, పాడిన విధానంపై, ట్యూన్‌పై… సెటైర్లు పడుతున్నాయి. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి దేవిశ్రీ అన్యాయం చేశాడంటూ కొందరు, ఒకప్పుడు సూపర్ హిట్ ట్యూన్లు ఇచ్చిన దేవికి ఏమైందని ఇంకొందరు – చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
మహేష్ పాటని ఇలా ట్రోల్ చేయడం ఇదేం కొత్తకాదు. ‘స్పైడర్’లో ‘పుచ్చకాయ పుచ్చకాయ’ పాట కూడా ఇలానే ట్రోల్ అయ్యింది. ఇదేం పాట…? అంటూ సాక్ష్యాత్తూ మహేష్ అభిమానులే పెదవి విరిచారు. బ్రహ్మోత్సవంలో మహేష్ వేసిన స్టెప్పుల్నీ అప్పట్లో ఇలానే కామెడీ చేసేశారు. ఇప్పుడు ‘సరిలేరు..’ వంతు వచ్చింది. ఈ పాట తీసిన విధానం కలర్ఫుల్గా ఉండి, మహేష్ భయంకరమైన స్టెప్పులు వేసి – ఈ పాట సినిమాలోని సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటే తప్ప – థియేటర్లో ఈ పాటకు సంతృప్తికరమైన ఫలితం వచ్చేట్టు కనిపించడం లేదు. ఈలోగా `మా పాట సోషల్ మీడియాలో ఇన్ని రికార్డులు సృష్టించిందం`టూ చిత్రబృందం హడావుడి మొదలెట్టేసింది. అలవాటుప్రకారం.