కొత్తదారుల్లో వెళ్లడానికి మన హీరోలు కాస్త జంకుతారు. ఎందుకంటే ఆ దారి ఎలా ఉంటుందో? అన్న కంగారు. అప్పుడప్పుడూ ఏదో కిందామీదా పడి కొత్త కథలు ఎంచుకొన్నా, ఒక్క దెబ్బ పడేసరికి పరారైపోతారు. మళ్లీ ప్రయోగాల జోలికి వెళ్లరుగాక వెళ్లరు. ప్రస్తుతం మహేష్ బాబు పరిస్థితీ అదే. ‘ప్రయోగాల జోలికి వెళ్లకూడదు. కమర్షియల్ పంథాలో ఆలోచించడమే ఉత్తమం’ అని కొత్త పాట పాడుతున్నాడు మహేష్. మరీ ఎక్కువగా ఆలోచించి, ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయకూడదని, అలా చేస్తే.. ఫలితాలు రావని మహేష్ అనుభవ పూర్వకంగా చెబుతున్నాడు. ఇంత అనుభవం సంపాదించడానికి కారణం వన్ – నేనొక్కడినే సినిమానే.
వన్.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకొంది. కమర్షియల్ చిత్రాల్లో కొత్త కోణమని మెచ్చుకొన్నారు కూడా. కానీ డబ్బులు రాలేదు. సగటు ప్రేక్షకుడికి ఈ కథ, కథనాలు, మహేష్ పాత్ర మింగుడు పడలేదు. దాంతో నిర్మాతలు నష్టపోయారు. అందుకే అలాంటి కథల జోలికి వెళ్లడానికి మహేష్ ఇప్పుడు ఇష్టపడడం లేదు. ‘పాత కథే అయినా.. కొత్తగా చెప్పే ప్రయత్నం చేయాలి. శ్రీమంతుడులో చేసింది అదే. ప్రేక్షకుడి ఎమోషన్స్‌ని పట్టుకోగలిగితే విజయం తథ్యం’ అంటున్నాడు మహేష్. బ్రహ్మోత్సవంలోనూ అదే సీన్ రిపీట్ అయితే.. అంతకంటే కావల్సింది ఏముంది? మహేష్ కూడా కోరుకొనేది అదే.