కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ అందాలభామలు శృతి హాసన్, హన్సిక నటించిన తమిళ సినిమా ‘పులి’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎల్లుండి సాయంత్రం చెన్నైలో జరుగుతోంది. దానికి ప్రిన్స్ మహేష్ బాబుని ముఖ్య అతిధిగా ఆహ్వానించడంతో ఆయన ఎల్లుండి మధ్యాహ్నం చెన్నైకి బయలుదేరుతున్నారు. తమిళ సినిమా పులికి తెలుగు నటుడు మహేష్ బాబుని ముఖ్యఅతిధిగా ఆహ్వానించడం రెండు రాష్ట్రాలలో ఉన్న అతని అభిమానులకు చాలా ఆనందం కలిగించే విషయమే. చింబు దేవేన్ స్వయంగా తయారుచేసుకొన్న కధని స్వీయ దర్శకత్వంలో శింభు తమీన్స్ మరియు పి.టి. సెల్వ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే టాలీవుడ్ డైనమిక్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న దేవీశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీదేవి, నందిత, సుదీప్, ప్రభు, విజయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 22న విడుదలయిన ఈ సినిమా టీజర్ కి అపూర్వ స్పందన వస్తోంది. అదే ఆ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 17న విడుదలవుతుంది.