కొన్ని సినిమాలంతే. వాటికి… బాక్సాఫీసు రిజల్ట్ తో పని లేదు. థియేటర్లో జనం చూడకపోయినా, కాసులు రాలకపోయినా, నిర్మాతలకు డబ్బులు మిగలకపోయినా – క్రమక్రమంగా క్లాసిక్కులు అయిపోతుంటాయి. `ఇది పోవాల్సిన సినిమా కాదురా..` అని తరవాతి తరం చెప్పుకునేలా మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో… ఖలేజా తప్పకుండా ఉంటుంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు.
అతడు – మహేష్ కెరీర్లో మర్చిపోలేని సినిమా. దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజ్ చెప్పిన సినిమా. విచిత్రమేంటంటే.. బాక్సాఫీసు పరంగా అతడు అద్భుతాలేం చేయలేదు. పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చింది. కానీ `మా` టీవీలో మాత్రం ఎప్పుడు టెలికాస్ట్ అయినా రేటింగులే రేటింగులు. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమాల్లో అదొకటి. ఆ తరవాత.. వీరి కాంబినేషన్లో `ఖలేజా` రూపొందింది. దైవం మనుష్య రూపేణా అనే కాన్సెప్ట్ ని త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆవిష్కరించాడు. అతడులో మహేష్ మహా క్లాస్ గా కనిపిస్తే… ఖలేజాలో ఊర మాస్ అవతారం ఎత్తేశాడు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ – ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. అతడులో త్రివిక్రమ్ రాసిన డైలాగులతో పోలిస్తే ఖలేజాలో ఇంకాస్త వైవిధ్యం, లోతు కనిపిస్తాయి. టేకింగ్ లో మరో మెట్టు ఎక్కాడు. ఇంట్రవెల్ సీన్ అయితే మహేష్ ఫ్యాన్స్కి బాగా నచ్చేసింది. మణిశర్మ అందించిన పాటల్లో `సదా శివ సన్యాసి` ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
అయితే.. ఎడారి ప్రాంతంలో మంచి నీళ్ల కోసం.. అంత బీభత్సం చేయడం లాంటి ఎక్స్ స్ట్రాలు కొన్ని అతిగా అనిపిస్తాయి. అనుష్క మహేష్ కి సరిజోడీ కాదని స్వయంగా ఫ్యాన్సే పెదవి విరిచారు. క్లైమాక్స్ కూడా సోసోగానే అనిపిస్తుంది. ఆ సినిమాపై జనాలు పెంచుకున్న అంచనాలకు, టైటిల్ కీ, కథకూ ఏమాత్రం సంబంధం లేకపోవడంతో అప్పట్లో ఈసినిమా అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు. మెల్లమెల్లగా టీవీల్లో చూసీ, చూసీ.. త్రివిక్రమ్ ఏం చెప్పదలచుకున్నాడో అర్థం చేసుకున్నారు. త్రివిక్రమ్ భాషలో చెప్పాలంటే జ్ఞనబల్బు కాస్త లేటుగా వెలిగిందన్నమాట. రికార్డుల మాటెలా ఉన్నా.. మహేష్ ఫ్యాన్స్కి, త్రివిక్రమ్ భక్తులకు ఈ సినిమా సమ్ థింగ్ స్పెషల్.
* ఖలేజాలో మర్చిపోలేని డైలాగులు
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు.. జరిగిన తరవాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు
స్వామీ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం
నువ్వే మా దేవుడవని నువ్వు నమ్మే పనిలేదు.. మాకు నమ్మించే అక్కర లేదు
దేవుడు ఎక్కడో పైన ఉండడు. నీలోనో నాలోనో ఉంటాడు. అవతలి వాడు సాయం కోసం అడిగినప్పుడు బయటకు వస్తాడు