అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా టాలీవుడ్‌ని షేక్ చేసేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సందీప్ తదుపరి సినిమా కచ్చితంగా స్టార్ హీరోతోనే అయ్యింటుందని ఊహించింది టాలీవుడ్. దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో మహేష్ బాబు పేరు ప్రముఖంగా వినిపించింది. మహేష్‌తో సందీప్ చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. మరి మహేష్ సందీప్ సినిమా ఉందా?? ఉంటే ఎప్పుడు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇవే ప్రశ్నల్ని మహేష్ ముందుంచింది మీడియా. సందీప్ రెడ్డితో సినిమా ఉందా? అని అడిగితే మహేష్ సూటిగా సమాధానం చెప్పలేదు. ”ఉంఉందండీ. కథ చెబితే, అది నచ్చితే తప్పకుండా చేస్తా” అన్నాడంతే. అంటే ఇప్పటి వరకూ సందీప్ కథ చెప్పలేదన్నమాట. త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాలున్నాయా అంటే వాటికీ ఇలానే కాస్త తికమకగా సమాధానం చెప్పాడు. ”అందరితోనూ సినిమాలుంటాయి. కథలు సెట్టయితే..” అంటూ నవ్వేశాడు. అంటే మహేష్ ఇప్పటి వరకూ ఎవరి కథా వినలేదన్నమాట. ‘భరత్ అనే నేను’ విడుదలయ్యాక.. అప్పుడు మళ్లీ కొత్త కథలు వినడం మొదలెడతాడు. మరి ఈ దర్శకులలో మహేష్ ఎవరికి టిక్కు పెడతాడో చూడాలి.