ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ధి చేసే కథాంశంతో రూపొందిన ‘శ్రీమంతుడు’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా నటించిన మహేష్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో చాలా మంది వివిధ గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మొదట మహేష్ దీనికి శ్రీకారం చుట్టాడు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఇది జరిగి 5 నెలలు గడిచింది. కానీ, మహేష్ మళ్ళీ ఆ మాట ఎత్తకపోగా ఒక్కసారి కూడా సిద్ధాపూర్ గ్రామాన్ని సందర్శించలేదట. మహేష్ తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడని ఎంతో సంతోషించిన ఆ గ్రామ ప్రజలకు ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు.
మా గ్రామాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం లేకపోతే అలాంటి ప్రకటన చెయ్యడమెందుకు? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశం మహేష్‌కి వుంటే గ్రామానికి వచ్చి పరిస్థితుల్ని సమీక్షించాలని, ఈ విషయంలో గ్రామస్తులంతా తమ సహకారాన్ని అందిస్తామని చెప్తున్నారు. మరి మహేష్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.