అసలే ఫ్యాన్స్ మధ్య గొడవలెక్కువ. నీ హీరో జీరో – నా హీరోనే హీరో.. అంటూ సమయం సందర్భం కుదిరినప్పుడల్లా తన్నుకు చస్తుంటారు. వాళ్ల పైత్యానికి సినిమాలు సాయం చేయకూడదు. కానీ అదే జరిగింది. సత్యదేవ్ నటించిన `ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య` సినిమా గురువారమే ఓటీటీ (నెట్ఫ్లిక్స్) ద్వారా విడుదలైంది. సినిమా టాక్ బాగుంది. రివ్యూలూ బాగానే ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఇద్దరు హీరో అభిమానుల మధ్య వైరాన్ని పెంచడానికి ఇదోదికంగా ఈ సినిమా కూడా సాయం చేస్తోంది.
ఎన్టీఆర్ – మహేష్ లకు సంబంధించిన డిస్కర్షన్ ఈసినిమాలో జరిగింది.సుహాస్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరో అమ్మాయి మహేష్ ఫ్యాన్స్. వాళ్లిద్దరూ.. నా హీరో గొప్పోడు అంటే నా హీరో గొప్పోడు అంటూ వాదించుకుంటారు. అక్కడితో ఆగరు. మరో హీరోపై సెటైర్లూ వేస్తారు. మహేష్ కదలకుండా నిలబడే కొడతాడు.. అంటూ ఓ పాత్ర అంటే, ఎన్టీఆర్.. పరిగెట్టించి, పరిగెట్టించి చంపుతాడు అని మరో పాత్ర అంటుంది. మహేష్ సినిమా చూసి, బాగోకపోతే. ట్విట్టర్లో ట్రోల్ చేసేది మేమే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్ గా సుహాస్ అంటాడు. నిజానికి ఇదంతా కామెడీ కోసమే కావొచ్చు. కానీ.. ఫ్యాన్స్ చిన్న విషయాలు పట్టుకుని రాద్దాంతం చేస్తుంటారు. వాళ్ల మధ్య పుల్ల పెట్టడం ఎందుకు? ఇది సత్యదేవ్ సినిమా కాబట్టి సరిపోయింది. మెగా హీరో నటించిన సినిమాలో ఇలాంటి సీన్ ఉంటే.. ఈపాటికి రచ్చ మొదలైపోయేది. దర్శకుడు, రచయితలు ఇలాంటి సున్నితమైన విషయాల్ని డీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.