“మేమూ మేమూ బావుంటాం! మీరూ బాగోవాలి” – జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన భరత్ బహిరంగ సభలో (భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్)లో మహేశ్ చెప్పిన మాట! అదే వేడుకలో తామెంత స్నేహంగా వుంటామనేది ఎన్టీఆర్ కూడా చెప్పారు. ఆ తరవాత మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సమయం సందర్భం కుదిరిన ప్రతిసారీ పార్టీలు చేసుకుంటున్నారు. ఇతరుల పార్టీల్లో కలిసి కట్టుగా కనిపిస్తున్నారు. తమ మధ్య సఖ్యతను చాటి చెబుతున్నారు. కానీ, అభిమానుల మధ్య మాత్రం సఖ్యత కోరవడుతోంది. ట్విట్టర్ సాక్షిగా మహేశ్, ఎన్టీఆర్ అభిమానులు మాటల యుద్ధానికి దిగారు. ఒకరి హీరోని మరొక హీరో అభిమానులు ఘోరంగా బూతులు తిట్టారు.
#siggulenintrfans శనివారం రాత్రి హైదరాబాద్ ట్విట్టర్ లో ఈ హాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది. మహేశ్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ దాడి చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ అభిమానులు మహేశ్ ని రాయడానికి వీలు లేని భాషలో వింత వింత హాష్ టాగ్స్ సృష్టించి తిట్టారు. ఎందుకు తిట్టారు అంటే… మహేశ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశారు. దానికి మహేశ్ రిప్లై ఇవ్వలేదు. తరవాత విజయ్ దేవరకొండ ‘మహర్షి’ సెట్ కి వెళ్ళి… ఫొటోలను ట్వీట్ చేస్తే, అతడికి రిప్లై ఇచ్చారు. ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో కొందరికి కోపం తెప్పించింది. దాంతో మహేశ్ ని ఘోరంగా తిట్టడం మొదలుపెట్టారు. ఇదంతా గమనించిన మహేశ్ అభిమానుల్లో కొందరు ప్రతిదాడి ప్రారంభించారు. ఒకరినొకరు ఘోరంగా తిట్టుకున్నారు. హీరోలు సఖ్యతగా వుంటున్నా… కొందరు దురాభిమానుల కారణంగా ఇటువంటి గొడవలు తప్పడం లేదు.