పాత సినిమాల్ని ఫ్రెష్షుగా రిలీజ్ చేయడం ఓ ట్రెండ్ గా మారిందిప్పుడు. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `పోకిరి`ని రిలీజ్ చేస్తే దాదాపు రూ.1.5 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పరిచింది. మొన్నటికి మొన్న పవన్ పుట్టిన రోజున `జల్సా`ని ఫోర్ కెలో రిలీజ్ చేస్తే.. ఏకంగా రూ.3 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇది ఆల్ ఇండియా.. ఆల్ టైమ్ రికార్డ్. ఎన్ని షోలు వేస్తే అన్ని షోలూ హౌస్‌ఫుల్సే. ఈ వ్యాపారం ఏదో బాగుందని మన సినిమా వాళ్లు ఫీలవుతున్నట్టున్నారు. అందుకే వరుసగా.. పాత సినిమాల బూజు దులిపి, కొత్తగా షో చేసి, రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలెడుతున్నారు. ప్రభాస్ పుట్టిన రోజున పురస్కరించుకొని `బిల్లా`ని రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ సాధించిన రికార్డుని బద్దలు కొట్టడం.. ప్రభాస్ ఫ్యాన్స్ ముందున్న లక్ష్యం.
ఇప్పుడు మరోసారి మహేష్ బాబు వంతు వచ్చింది. 2023 జవవరి 8 నాటికి ఒక్కడు విడుదలై 20 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా `ఒక్కడు` సినిమాని రి- రిలీజ్ చేయబోతున్నారు. 8న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. సంక్రాంతి సీజన్లో కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. అయినా సరే.. ఒక్కడు వెనుకడుగు వేయడం లేదు. సంక్రాంతి సీజన్‌ని ఈ రూపంలో క్యాష్ చేసుకోవాలని చూస్తోంది ఒక్కడు టీమ్. జనవరి 8 అంటే పండగ సీజన్ మొదలవుతుంది. అప్పటికి… కొత్త సినిమాలేవీ రాకపోవొచ్చు. అది.. ఒక్కడుకి ప్లస్ కానుంది.