మహేష్ దగ్గర ఓ మంచి అలవాటు ఉంది. తనకేదైనా సినిమా నచ్చితే వెంటనే స్పందిస్తాడు. ట్వీట్లతో ప్రచారం కల్పిస్తాడు. ‘నవాబ్’ విషయంలోనూ అదే జరుగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహేష్‌కి తెగ నచ్చేసింది. అందుకే ఏకంగా ‘ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నైలో మణిరత్నం అభిమానిగా థియేటర్లలో సినిమాలు చూసిన రోజులు గుర్తు చేసుకున్నాడు మహేష్. అంతే కాదు.. `మాస్టర్ ఈజ్ బ్యాక్` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. రెహమాన్, సంతోష్ శివన్…. ఇలా పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే… మహేష్ మణిరత్నంకి ఓసినిమా బాకీ ఉన్నాడు. ‘ఓకే బంగారం తరవాత మహేష్ తో మణిరత్నం ఓ సినిమా చేయనున్నారని వార్తలొచ్చాయి. ఓ కథ పట్టుకుని మహేష్, రామ్ చరణ్‌లను సంప్రదించాడు మణి. అయితే… మణి ఫామ్‌పై నమ్మకం లేకపోవడంతో ఇద్దరూ `నో` చెప్పేశారు. మణిరత్నం లాంటి దర్శకుడికి ఫామ్‌తో అవసరం లేదని, ఎప్పుడైనా వాళ్లు అద్భుతాలు సృష్టించడం ఖాయమని `నవాబ్`తో తేలిపోయింది. `నవాబ్`ని ఓ అభిమానిగా విపరీతంగా ప్రేమించిన మహేష్ – ఇప్పుడైనా మణిరత్నంతో సినిమా చేయడానికి ముందుకొస్తాడేమో చూడాలి.