ఒకే కథని రెండు భాగాలుగా ఎలా తీయాలో ‘బాహుబలి’తో నేర్పించాడు రాజమౌళి. ఆ తరవాత పుష్ష, కేజీఎఫ్ లాంటి సినిమాలు ఆయన బాటలోనే నడిచి, ఘన విజయాలు దక్కించుకొన్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ని రెండు భాగాలుగా తీస్తారన్న ప్రచారం జరిగింది కానీ, రాజమౌళి అందుకు మొగ్గు చూపలేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే రాజమౌళి ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు టాక్.
మహేష్ – రాజమౌళి కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సెప్టెంబరు నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కథ పూర్తయ్యింది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం మహేష్ బరువు పెరుగుతున్నారని, ఆయన మేకొవర్ కొత్తగా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తయ్యిందట. కె.ఎల్.నారాయణ ఈ చిత్రానికి నిర్మాత. ఆయనతో పాటు ఓ హాలీవుడ్ సంస్థ నిర్మాణంలో భాగస్వామి కానుందని తెలుస్తోంది. ఆ వివరాలు త్వరలో వెల్లడవుతాయి.