మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషషన్లో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ ఓ శుభవార్త. మహేష్ ఈ సినిమాకు డేట్లు ఇచ్చేశారు. సంక్రాంతి తరవాత షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి చిత్రబృందం సిద్ధమైంది. జనవరి ద్వితీయార్థంలో ఈ చిత్రానికి క్లాప్ కొడతారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. నిజానికి రాజమౌళి స్క్రిప్టు విషయంలో ఇంకాస్త సమయం తీసుకోబోతున్నారని, ఏప్రిల్ వరకూ షూటింగ్ మొదలు కాదని అనుకొన్నారంతా. అయితే… జనవరిలోనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టుకోవడం ఫ్యాన్స్‌ని సైతం ఆశ్చర్యపరిచేదే.
ఈ సినిమా కోసం ఓ వైపు రామోజీ ఫిల్మ్‌సిటీతో పాటుగా, హైదరాబాద్ శివార్లలో కొన్ని భారీ సెట్లు రూపొందించారు. వాటిలోనే తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఏప్రిల్ వరకూ… హైదరాబాద్ లోనే షూటింగ్. ఆ తరవాత కొంత బ్రేక్ తీసుకొని, విదేశాల్లో చిత్రీకరరించే అవకాశాలు ఉన్నాయి. మహేష్ తప్ప, ఇతర నటీనటులెవర్నీ అధికారికంగా ఖరారు చేయలేదు రాజమౌళి. ఈ సినిమా ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ సిద్ధమైంది. అందులో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. రాజమౌళి ఏ సినిమా మొదలు పెట్టినా, ఓ ప్రెస్ మీట్ పెట్టి, కథని క్లుప్తంగా చెప్పి, సందేహాల్ని క్లియర్ చేయడం అలవాటు. ఈసారీ ఆయన అదే పంధా అనుసరించబోతున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందించే చిత్రమిది. ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సివుంది.