రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్లు పట్టాల్సిందే. హీరోలు కూడా అందుకు ప్రిపేర్ అయిపోతారు. ఈ మూడేళ్లలో మూడు సినిమాలు చేసినా రాని మైలేజీ, రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి.. మూడేళ్లు ధారాదత్తం చేయడానికి రెడీ. ఇప్పుడు మహేష్ బాబు తో రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా మూడేళ్లు గ్యారెంటీ అని… జనాలంతా ఫిక్సయిపోతున్నారు.
కానీ… రాజమౌళి మాత్రం ఈసారి కొత్తగా ఆలోచిస్తున్నాడట. ఈ సినిమాని కేవలం యేడాదిలోగా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకొన్నాడని టాక్. ఈ జూన్ నుంచి.. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టబోతున్నాడు రాజమౌళి. 2023 జనవరిలో సినిమా మొదలెట్టి, 2024 జనవరిలో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో రెండు మూడు నెలలు పట్టినా… 2024 వేసవిలో మహేష్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడట. ఆరు నూరైనా ఈ సారి యేడాదిలోనే సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు జక్కన్న. అందుకే ప్రీ ప్రొడక్షన్ కి ఏకంగా ఆరు నెలలు తీసుకుంటున్నాడు. నిజానికి `ఆర్.ఆర్.ఆర్` మూడేళ్లు పట్టింది కానీ, వర్కింగ్ డేస్ చాలా తక్కువ. మధ్యలో కరోనా, లాక్ డౌన్, టికెట్ రేట్లు సరిగా లేకపోవడం వల్ల సినిమా వాయిదా పడుతూ వెళ్లింది. దాంతో మూడేళ్లు తినేసిందని ఫీలయ్యారంతా. ఆ బాధలేవీ ఇప్పుడు లేవు కాబట్టి, ఏడాదిలో మహేష్ సినిమా లాగించేయొచ్చని ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.