కమర్షియల్ హీరో అనే ముద్ర పడిపోయిన తరవాత – అవార్డులు వాళ్లకు దూరమైపోతాయి. పైసా వసూల్ సినిమాకి అవార్డులు రావడం కష్టమైన పనే. అందులో నటించిన హీరోల చేతిలో పురస్కారాలు రావడం కూడా గగనమే. అయితే.. ఈమధ్య పురస్కారాల పంథా మారింది. కమర్షియల్ సినిమాలకే ఎక్కువ అవార్డులు వస్తున్నాయి. మాస్ హీరోలూ అవార్డులు ఎగరేసుకుపోతున్నారు. ఈ జాబితాలో అందరికంటే ముందు ఉండే కథానాయకుడు మహేష్ బాబు. ఇప్పటికి ఏకంగా 8 నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమనటుడిగా శ్రీమంతుడు మహేష్ కి 8వ సారి నంది పురస్కారం దక్కించింది. ఈ ఎనిమిది నందుల్లో నాలుగు జ్యూరీ అవార్డులు ఉన్నాయి. ఈ స్థాయిలో నందులు అందుకొన్న హీరో టాలీవుడ్లోనే లేడు. రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్, నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు మహేష్‌కి నందులు తీసుకొచ్చాయి. ఈ రికార్డును ఇప్పట్లో బద్దలు కొట్టడం కూడా అసాధ్యమే. వెంకటేష్ 7 నందులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా పోషిస్తాడని పేరు తెచ్చుకొన్న ఎన్టీఆర్ సాధించినవి రెండే రెండు నందులు. ఆ మాటకొస్తే.. పవన్ కల్యాణ్‌కి ఒక్క నంది అవార్డు కూడా లేదు.