ఎంత భారీ బడ్జెట్ పెట్టి ఎంత పెద్ద హీరోలతో సినిమాలు తీసినా సినిమా నచ్చకపోతే ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా వాటిని తిరస్కరిస్తుంటారు. పవన్ కళ్యాణ్, రజనీ కాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ ఇలా ఒకరేమిటి ఎవరి సినిమాలు కూడా ఇందుకుమినహాయింపు కాదు. అటువంటప్పుడు అందరికంటే ముందు నష్టపోయేది నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఆ సినిమాల కోసం కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొనే దర్శకులు, హీరోలు ఏమాత్రం నష్టపోకుండా వెంటనే మరొక సినిమాతో బిజీ అయిపోతారు.
ఈ సమస్యకి ఫిలిం ఛాంబర్ ఒక పరిష్కారం కనుగొంది. ఏదయినా సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమా దర్శకుడు, హీరో ఇద్దరూ కూడా డిస్ట్రిబ్యూటర్లకు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాత ఎలాగూ నష్టపోయే ఉంటాడు కనుక అతనికి మినహాయింపునిచ్చారు. మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఒప్పందం ప్రకారం హీరో మహేష్ బాబు సుమారు రెండున్నర కోట్లు, దర్శకుడు శ్రీను వైట్ల మరో రెండున్నర కోట్లు డిస్ట్రిబ్యూటర్లకి చెల్లించేందుకు అంగీకరించారు. మహేష్ బాబు డిస్ట్రిబ్యూటర్లకి పేమెంట్ చేయడం కూడా మొదలుపెట్టారు. దర్శకుడు శ్రీను వైట్ల తన తరువాత సినిమా రిలీజ్ అయినప్పుడు ‘ఆగడు’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ మెంట్ చేస్తారు. ఇంతకు ముందు రజనీ కాంత్ ఈవిధంగా చాలాసార్లు డిస్ట్రిబ్యూటర్లకు సొమ్ము వాపసు చేసి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆయన బాటలోనే నడుస్తూ డిస్ట్రిబ్యూటర్లకు సొమ్ము వాపసు చేయడం చాలా హర్షణీయం.