రాజమౌళిది ఓ సెపరేట్ స్కూలు. తనతో సినిమా అంటే హీరోలెంత ఉత్సాహం చూపిస్తారో, అంత కంట్రోల్ లోనూ ఉంటారు. సినిమా ఒప్పుకొన్న దగ్గర్నుంచి, రిలీజ్ వరకూ రాజమౌళి అధీనంలోనే ఉండాలి. అన్నీ రాజమౌళి కన్నుసన్నల్లోనే జరగాలి. ఇప్పుడు మహేష్ బాబుదీ అదే దారి. మహేష్ – రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలైపోయాయి. మార్చి నుంచి మహేష్… రాజమౌళికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండబోతున్నాడు. అందుకోసం కొన్ని త్యాగాలకూ సిద్ధమయ్యాడు.
మార్చి నుంచి.. సినిమా విడుదల వరకూ మహేష్ నుంచి ఒక్క ఫొటో కూడా బయటకు రాకూడదన్నది ఓ అగ్రిమెంట్. మహేష్ స్వతహాగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు. షెడ్యూల్ మధ్యలో చిన్న బ్రేక్ దొరికినా విదేశాలకు చెక్కేస్తుంటాడు. అలాంటి టూర్లు కూడా ఇకపై ఉండబోవని తెలుస్తోంది. పైగా మహేష్ చాలా బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉంటున్నాడు. రాజమౌళి సినిమా పూర్తయ్యేంత వరకూ ఆ యాడ్స్ లో కూడా మహేష్ ఇకపై కనిపించడు. షూటింగ్ అయ్యేంతలోగా.. మహేష్ లుక్ బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజమౌళి ఇలాంటి కండీషన్లు పెట్టాడని తెలుస్తోంది. అందుకు మహేష్ కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ లుక్ పూర్తిగా కొత్త స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం లుక్ టెస్ట్ కోసమే నెల రోజుల సమయం కేటాయించాల్సివస్తోందట. రాజమౌళి ఇప్పటికే కొన్ని స్కెచ్చులు సిద్ధం చేశాడు. వాటి అనుగుణంగా మహేష్ తన లుక్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చిలో మహేష్‌పై రాజమౌళి ఫొటో షూట్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. వాటి వివరాలూ పూర్తిగా గోప్యంగా ఉంచబోతున్నార్ట.