”కమర్షియల్ హీరో అయ్యుండి… ఇన్ని ప్రయోగాలు చేసిన హీరో మరెవ్వరూ లేరు, ఈ విషయంలో మహేష్ బాబునే మాకు ఆదర్శం” – అని ఆమధ్య భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. నిజంగానే మహేష్ చాలా ప్రయోగాలు చేశాడు. నాని, నిజం లాంటి సినిమాల్ని ఒప్పుకోవడం ఓ రకంగా ప్రయోగమే. అయితే తాను ప్రస్తుతం ప్రయోగాలు చేసే మూడ్‌లో లేనని చెబుతున్నాడు మహేష్ బాబు. ‘భరత్ అనే నేను’ విడుదల సందర్భంగా మహేష్ హైదరబాద్‌లో విలేకరులతో మాట్లాడాడు. ”ప్రయోగాలు చేసీ చేసీ అలసిపోయా. ఇక వాటి గురించి ఆలోచించను. ఇక మీదట కమర్షియల్ సినిమాలే చేస్తా” అని క్లారిటీ ఇచ్చాడు మహేష్.
రాజకీయాల గురించి మాట్లాడమంటే ఆమడదూరం పారిపోయే మహేష్… పొలిటికల్ డ్రామా లాంటి ఈ కథని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమా చేశాక.. రాజకీయాలపై ప్రేమ పెరిగిందా? ఇటు వచ్చే అవకాశాలున్నాయా? అని అడిగితే దానిపైనా స్పందించాడు. ”రాజకీయాలపై అవగాహన వచ్చిన మాట నిజమే. కాకపోతే నాకు రాజకీయాలు పడవు. నేను వాటికి దూరం. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాను” అని చెప్పేశాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోం వర్క్ చేసిందేం లేదని, కొరటాల శివ చెప్పింది చెప్పినట్టు చేశానని, బావ గల్లా జయదేవ్ పార్లమెంటులో ఇచ్చిన స్పీచుల్ని కొన్నింటిని పరిశీలించానని చెప్పుకొచ్చాడు మహేష్.