ఎస్.ఎస్.రాజమౌళి స్కూల్ వేరు. ఎంతటి స్టార్ అయినా… ఆ స్కూలు తాలుకూ రూల్స్ & రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే. రాజమౌళిని నమ్మి దిగిపోతే – ఎలాంటి సినిమా వస్తుందో, హీరోలకూ తెలుసు. అందుకే వాళ్లెవరూ రాజమౌళికి ఎదురు చెప్పరు. ఆఖరికి మహేష్‌బాబు అయినా సరే.
ఈ సినిమా మొదలయ్యేటప్పుడు చాలా రకాలుగా మాట్లాడుకొన్నారు. మహేష్ పూర్తిగా రాజమౌళికి మౌల్డ్ అవ్వాల్సిందే అని, రాజమౌళి చెప్పినట్టు చేయాల్సిందే అని అనుకొన్నారు. అంతే కాదు… మహేష్ కు రాజమౌళి కొన్ని కండీషన్లు పెట్టాడని, మహేష్ ఈ సినిమా పూర్తయ్యే వరకూ తన లుక్ బయటకు రానివ్వకూడదన్నది ముఖ్యమైన షరతు అని. అందుకోసం ఎండార్స్మెంట్లకు దూరంగా ఉండాలని, ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ టూర్లకు కూడా వెళ్లకూడదన్న ఆంక్షలు ఉన్నాయని చెప్పుకొన్నారు. వందల కోట్లతో తీస్తున్న సినిమా ఇది. మహేష్ లుక్ బయటకు వస్తే – ఆ సర్ప్రైజ్ పోతుంది. కాబట్టి రాజమౌళి నిబంధనల్ని ఎవ్వరూ తప్పుపట్టలేదు. దాంతో మహేష్ ఇక ఎండార్స్మెంట్లు చేయడు, బయట అస్సలు కనిపించడు అనుకొన్నారు.
కానీ తీరా చూస్తే… మహేష్ యాడ్ ఒకటి బయటకు వచ్చింది. అందులో రాజమౌళి సినిమా లుక్‌లోనే దర్శనమిచ్చాడు మహేష్. రేపో – మాపో… సమ్మర్ వెకేషన్స్‌కి ఎప్పటిలా ఫారెన్ టూర్ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే… రాజమౌళి రూల్స్ మహేష్ దగ్గర వర్కవుట్ అవ్వలేదని అర్థం చేసుకోవాలి. లేదంటే…. మహేష్ కి రాజమౌళి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడని అనుకోవాలి.
‘గుంటూరు కారం’ తరవాత రాజమౌళి సినిమా కోసం ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాడు మహేష్. 2025లో మహేష్ సినిమా చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కలేదు. కనీసం ఎండార్స్మెంట్లలో అయినా మహేష్ ని చూసి హ్యాపీ అయిపోవొచ్చు. 2026లో ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలన్నది రాజమౌళి ఆలోచన. ప్రీ ప్రొడక్షన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన జక్కన్న… షూటింగ్ మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నారు.