అనిల్ సుంకరకు.. మహేష్ బాబుకీ సన్నిహిత సంబంధాలున్నాయి. దూకుడు, ఆగడు లాంటి సినిమాలకు అనిల్ సుంకర నిర్మాత. ఇప్పటికీ వారిద్దరూ టచ్‌లోనే ఉంటారు. భోళా శంకర్‌కు సంబంధించిన మహేష్.. అనిల్ సుంకరకు ఓ విలువైన సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని.. అనిల్ సుంకర స్వయంగా వెల్లడించాడు.
”నాకు స్వతహాగా సెట్ కి వెళ్లే అలవాటు లేదు. దర్శకుడుకి ఏం కావాలో తెర వెనుక చూసుకోవడమే ఇష్టం.క కానీ చిరంజీవిగారితో సినిమా చేస్తున్నానని మహేష్‌కి చెప్పగానే.. ‘మీరు సెట్ కి వెళ్తుండండి. బాగా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవిగారికి.. నిర్మాత సెట్లో ఉండడమే ఇష్టం’ అని సలహా ఇచ్చారు. అది అక్షరాలా నిజం. చిరంజీవిగారు సెట్లో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. ఆ మూమెంట్స్‌ని నేను బాగా ఎంజాయ్ చేశాను” అని చెప్పుకొచ్చారు అనిల్ సుంకర. శుక్రవారం భోళా విడుదల అవుతోంది. ఓవైపు ‘జైలర్’, మరో వైపు `’భోళా శంకర్’ విడుదల అవుతున్న పక్షంలో.. ఈ రెండు సినిమాలకూ ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అని చిత్రసీమ ఎదురు చూస్తోంది. ”భోళా శంకర్ మాస్, కమర్షియల్ సినిమా. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వస్తాయి. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని అనుకోవడం లేదు. కానీ చిరు స్టామినాకు తగ్గట్టుగానే వసూళ్లు వస్తాయన్న నమ్మకం ఉంది” అన్నారు అనిల్ సుంకర. ఆయన చేతిలో ఇప్పుడు పది సినిమాలున్నాయి. అయితే… ‘ఏజెంట్’ నేర్పిన పాఠంతో ప్రతీ సినిమానీ స్క్రిప్టు దశ నుంచే జల్లెడ పట్టి చేస్తున్నార్ట. రాబోయే సినిమాలు తప్పకుండా నిర్మాతగా తనకు మంచి లాభాల్ని తెచ్చి పెడతాయని నమ్మకంగా ఉన్నారు.