ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. మధ్యమధ్యలో కుటుంబానికీ సమయం కేటాయిస్తూ… ఫ్యామిలీ లైఫ్‌నీ బాగా ఎంజాయ్ చేస్తు సమతుల్యం పాటిస్తున్నాడు. మహర్షి పూర్తవ్వగానే సుకుమార్ సినిమా మొదలెట్టాలి. జూన్ – జులైలలో ఈ ప్రాజెక్టు సెట్‌పైకి వెళ్లాల్సింది. అయితే…మహర్షికీ సుకుమార్ సినిమాకీ మధ్య మరో సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నాడట మహేష్. దానికీ ఓ కారణం ఉంది. మహర్షి.. సీరియస్ టెంపోలో సాగే సినిమా. స్నేహం, రైతు సమస్యలు లాంటి అంశాలుంటాయి. సుకుమార్ కథలోనూ కాస్త సీరియస్ అంశాలు ఉండబోతున్నాయట. వరుసగా రెండూ ఒకే తరహా సినిమాలవుతాయేమో అన్నది మహేష్ ఫీలింగ్.
మహర్షి తరవాత ఓ పక్కా కమర్షియల్ సినిమా వస్తే మంచిదని అనుకుంటున్నాడు. సుకుమార్ కమర్షియల్ దర్శకుడే. కాకపోతే.. కాస్త ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రయోగాలు చేయడంలో రిస్క్ ఎక్కువ. మహర్షి లాంటి సినిమా తరవాత అలాంటి రిస్కు తీసుకోవడం ఎందుకన్నది… మహేష్ భావన. దానికి తోడు.. సుకుమార్ కూడా పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయలేదు. ఇప్పటి వరకూ మహేష్‌కి సుక్కు కథే చెప్పలేదని తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం కుటుంబంతో సరదాగా సెలవులు గడుపుతున్నాడు. సుకుమార్ కూడా సంక్రాంతి మూడ్‌లోనే ఉన్నాడు. తన స్వగ్రామం మట్టపర్రులో… సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ పండగ హడావుడి అయ్యాకే కథపై సీరియస్‌గా కూర్చోవాలని సుకుమార్ భావిస్తున్నట్టు టాక్. వీలైనంత త్వరగా సుకుమార్ కథ సిద్ధం చేస్తే ఓకే. లేదంటే మాత్రం ఓ యువ దర్శకుడితో కమర్షియల్ సినిమాని పట్టాలెక్కించి దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మహేష్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.