ఫస్ట్ ఓత్ తో ‘భరత్ అనే నేను’ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టాడు మహేష్ బాబు. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్ల తరవాత విడుదల అవుతున్న సినిమా అయినా సరే, దానికి ఉండాల్సిన అంచనాలు దానికి ఉన్నాయి. శ్రీమంతుడు కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మామూలుది కాదు. పైగా కొరటాల శివ తప్పు చేయడని గట్టి నమ్మకం. అయితే ‘భరత్ అనే నేను’ విడుదలకు ముందు కాస్త హైడ్రామా తప్పదన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. దానికి కారణం.. `స్పైడర్` ఫ్లాప్. ఈ సినిమాతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. కొన్ని ఏరియాల్లో 60 నుంచి 70 శాతం వరకూ నష్టాలొచ్చాయి. వీటిలో కొంత చిత్రబృందం తిరిగి ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్లో గొడవలు కూడా మొదలయ్యాయి. మహేష్ తన తరపునుంచి ఆరు కోట్లు ఇస్తాడని మాటిచ్చాడు కూడా.
అయితే మహేష్ చెప్పాడే గానీ… ఇంత వరకూ ఆ డబ్బులు ఇవ్వలేదు. దాంతో ‘భరత్ అనే నేను’ విడుదల కి ముందు బయ్యర్లు గొడవ పెట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ గొడవ సెటిల్ చేస్తే తప్ప.. సినిమా విడుదల అవ్వదు. అందుకే విడుదల తేదీ వరకూ ఆగి.. సమస్యని పీకల మీదకు తెచ్చుకోకుండా మధ్యలోనే సెటిల్ చేయాలని.. డివివి దానయ్య భావిస్తున్నార్ట. ఈ విషయమై ఆయన మహేష్ ని కూడా సంప్రదించారని, మహేష్ ఈ వ్యవహారం మొత్తాన్ని నమ్రతకి అప్పగించారని తెలుస్తోంది. మహేష్ బాకీ ఎప్పుడు తీరుస్తాడా బయ్యర్లు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో..?