యేడాదికో సినిమా.. మహేష్ స్ట్రాటజీ ముందు నుంచీ ఇదే. కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడంతో సినిమా సినిమాకి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. అయితే 2020లో మహేష్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి సినిమాని 2020 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్. 2020 మార్చి నుంచి పరశురామ్ సినిమా మొదలైపోతుంది. పరశురామ్ సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నది టార్గెట్. పరశురామ్ కూడా స్పీడుగా సినిమా తీయడంలో సమర్థుడే. పరశురామ్ సినిమాని 2020 చివర్లో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే 2020లో మహేష్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట. జూన్‌లో అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కిస్తారు. డిసెంబరు నాటికి సినిమా పూర్తయిపోతుంది. 2020 సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉండే అవకాశాలున్నాయి. పరశురామ్ సినిమా పూర్తయిన తరవాత రాజమౌళి కాంబినేషన్లో మహేష్ సినిమా మొదలవ్వబోతోంది. త్రివిక్రమ్ కూడా మహేష్‌తో సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. మరోవైపు సుకుమార్ సినిమా ఒకటి పెండింగ్‌లో ఉంది. సో… రాబోయే రెండు మూడేళ్లలో మహేష్ కాల్షీట్లు అస్సలు ఖాళీ లేవన్నమాట.