మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై.. సగం పూర్తవ్వాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఇది వరకు త్రివిక్రమ్ కి మహేష్ ఓ కథ చెప్పాడు. దాంట్లో మార్పులూ చేర్పులూ సూచించడంతో.. రిపేర్లు చేసీ, చేసీ.. అలసిపోయి, ఆ కథని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఫ్రెష్షుగా కొత్త కథ రాసుకొన్నారు. ఈ నెలాఖరున గానీ, సంక్రాంతి అయ్యాక గానీ షూటింగ్ మొదలవుతుంది.
అయితే.. ఇది వరకు పాత కథతో ఓ షెడ్యూల్ జరిగింది. అందులో భాగంగా ఓ ఫైటు కూడా తీశారు. ఎలాగైనా సరే.. ఆ ఫైట్ని కొత్త కథలో వాడేద్దామని చూశారు. కానీ కుదరడం లేదు. కొత్త కథలో ఆ యాక్షన్ సీన్ ఇమడడం లేదు. దాంతో ఆ ఫైట్ ఇప్పుడు డస్ట్ బిన్లోకి నెట్టేసినట్టే. ఆ ఫైట్ కోసం దాదాపుగా ఏడెనిమిది కోట్లు వచ్చించినట్టు సమాచారం. ఆ డబ్బంతా వృథా అయినట్టే. పూరి – విజయ్ దేవరకొండ `జనగణమన` విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా మొదలెట్టి. కొన్ని సీన్లు తీశారు. ఆయా సన్నివేశాలకు దాదాపు రూ.12 కోట్లు ఖర్చయ్యింది.తీరా చూస్తే ప్రాజెక్టు ఆగిపోయింది. ఇలా… కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ములు వృథా అయిపోయాయి.