త్రివిక్రమ్ సత్తా తెలియంది కాదు. దక్షిణాదినే పేరొందిన దర్శకుడు. మాటలతో మ్యాజిక్ చేస్తాడు. కాకపోతే… ఒకే ఒక్క విమర్శ. తన ప్రతి కథా ఒకేలా ఉంటుందని. ఓ కుటుంబం ఏదో సమస్యలో ఉంటుంది.. హీరో అక్కడకు వెళ్లి, ఆ సమస్యల్ని తీర్చేస్తాడు. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో.. ఈ కథలన్నీ అవే బాపతు. కానీ త్రివిక్రమ్ మ్యాజిక్… పని చేయడం వల్ల- హీరోల క్యారెక్టరైజేషన్లు కొత్తగా రాసుకోవడం వల్ల అత్తారింటికి, అల వైకుంఠపురములో ఆడేశాయి.
ఇప్పుడు మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇంచుమించు ఈ కథ కూడా ఇలాంటిదే అని సమాచారం. హీరో – ఓ కుటుంబంలో చేరి, అక్కడి సమస్యల్ని పరిష్కరించడమే. కాకపోతే… త్రివిక్రమ్ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది కదా. కాబట్టి.. `ఇది పాత కథే..` అన్న ఫీలింగ్ రాకుండా మార్చగలడు, ఏమార్చగలడు. మొత్తానికి మహేష్ కోసం ఓ ఫ్యామిలీ డ్రామా ని సిద్ధం చేశాడు త్రివిక్రమ్. అయితే అందులోనూ యాక్షన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మరో విషయం ఏమిటంటే… ఈసినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. ఎప్పుడు మొదలెట్టినా సరే… ఈ యేడాది చివరి నాటికి సినిమా పూర్తి చేసేయాలన్నది త్రివిక్రమ్ టార్గెట్.