ఊరికి ఉపకారం చేయాలనే ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం అభినందనీయం. సినీనటుడు మహేశ్ బాబు చెప్పింది చేశారు. ఊరికి తిరిగిచ్చెయ్యాలి, లేకపోతే లావైపోతారంటూ శ్రీమంతుడులో ఉదాత్తమైన పాత్రను పోషించిన మహేశ్, రెండు గ్రామాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. తమ స్వగ్రామం గుంటూరు జిల్లా బుర్రిపాలెం, మహబూబ్ నగర్ జిల్లా సిద్దాపూర్ ల దత్తత ఇంతకు ముందే ప్రకటించారు. ఆ తర్వాత ఆదివారం బుర్రిపాలెం వెళ్లారు. తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి ఊరికి వెళ్లిన మహేశ్, అక్కడి ప్రజల ప్రేమాభిమానాల్లో తడిసి ముద్దయ్యారు. తమ ఊరి ముద్దుబిడ్డ ఇలా తమ ముందుకు రావడం చూసి అభిమానులు, ఊరి ప్రజలు, పొరుగూళ్ల జనం అంతా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
గ్రామంలో 2 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అభివృద్ధి పనులు చేయాలని ఆయన సంకల్పించారు. ఆ పనులను ప్రారంభించారు. సొంతిల్లు లేని కొందరికి ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారు. స్వయం సహాయక గ్రూపుల మహిళలకు చెక్కులు ఇచ్చారు. ముఖ్యంగా విద్య, వైద్య సేవలే తన టాప్ ప్రయారిటీ అని ఆయన చెప్పారు. అందరికీ ఆరోగ్యం తన ప్రధాన ఎజెండా అని చెప్పారు. బాలలకు మంచి విద్య అందించడానికి ఏర్పాట్లు చేస్తానన్నారు.
డబ్బు సంపాదించిన ప్రతి వారూ శ్రీమంతులు కారు. మాతృదేశానికి లేదా సొంత ఊరికి, బలహీనులకు ఎంతో కొంత సేవ చేసే వారే సిసలైన శ్రీమంతులు. ప్రజలు సినిమాలు చూడటం వల్లే సినీ తారలకు డబ్బు, పలుకుబడి వస్తాయి. ఆ ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలనే సంకల్పం ఉన్న అతికొద్ది మంది భారతీయ సెలెబ్రిటీల్లో మహేశ్ ఒకరు.
అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో సెలెబ్రిటీలు భారీగా సామాజిక సేవకు విరాళాలు ఇస్తారు. హాలీవుడ్ ప్రముఖ నటీనటుల్లో ఆఫ్రికా ఇతర పేదదేశాల వారికోసం మిలియన్ల కొద్దీ డాలర్లు విరాళాలు ఇవ్వని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.
పాలమూరు జిల్లాలో తాను దత్తత తీసుకున్న సిద్దాపూర్ కు వచ్చే వారం వెళ్తానని మహేశ్ చెప్పారు. ఇప్పటికే ఆయన భార్య నమ్రత ఆ గ్రామానికి వెళ్లి వచ్చారు. అభివృద్ధి పనులు చేస్తామని హామీఇచ్చారు. టాలీవుడ్ లో ఇలాంటి సేవాభావం చాలా తక్కువ. బాలీవుడ్ నటుల్లో అక్షయ్ కుమార్, నానా పాటేకర్ లాంటి వారు మహారాష్ట్రలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు యథాశక్తి సాయం చేశారు. భారతీయ సెలెబ్రిటీల్లో కోట్లు సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు. ప్రజలు సినిమాలు చూడటం వల్లే వాళ్లకు అన్ని కోట్ల సంపద వచ్చింది. కాబట్టి ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని సెలెబ్రిటీలు అందరూ ముందుకు వస్తే లక్షల మంది పేదవారికి చాలా మేలు కలుగుతుంది. రియల్ హీరోస్ గా వాళ్లకు మరింత గుర్తింపు దక్కుతుంది.