రంగస్థలంతో.. సుకుమార్ పేరు మార్మోగిపోతోంది. సింపుల్ కథని భలే చెప్పాడ్రా.. అనే వాళ్లు ఎక్కువవుతున్నారు. చరణ్‌లోని టాలెంట్ భలే లాగాడ్రా.. అని మెచ్చుకుంటున్నారు. సుకుమార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది. మగధీర తరవాత చరణ్‌కీ ఇదే పెద్ద హిట్. ఆ రికార్డుల్ని.. ఈ సినిమా చెరిపేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా సుకుమార్ క్రెడిట్టే. అందుకే ఇటు నిర్మాతలు, అటు హీరోలు కర్చిఫ్లు రెడీ చేసేసుకుంటున్నారు. అల్లు అర్జున్‌తో సుకుమార్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే… ఇప్పుడు మహేష్ బాబు కూడా కబురంపాడు. ”రంగస్థలం హడావుడి అయ్యాక.. రిలాక్స్ గా వచ్చి ఓసారి కలవండి” అంటూ కబురంపాడట మహేష్. వీరిద్దరి కలయికలో ‘వన్’ వచ్చింది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా అంతగా ప్రభావితం చూపించలేదు గానీ – విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈసారి ఇద్దరూ మంచి కమర్షియల్ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సుకుమార్‌కి ఆప్షన్లు ఎక్కువవుతున్నా.. తాను ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ”లైన్లయితే నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ కథంటూ పూర్తి స్థాయిలో రెడీ చేసుకోలేదు” అంటున్నాడు సుక్కు. మరి మహేష్‌కి ఎలాంటి లైన్ వినిపిస్తాడో చూడాలి.