ముందు నుంచీ అనుకొంటున్నట్టే.. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ రోజు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘గుంటూరు కారం’ టైటిల్ ఖరారు చేశారు. మహేష్ ని ఓ భారీ ఎలివేషన్‌తో పరిచయం చేశారు. టైటిల్‌కి తగ్గట్టే గుంటూరు మిర్చీ యాడ్‌లో.. ఓ ఫైట్ సీక్వెన్స్‌కి ఇంట్రో లా సాగిన గ్లిమ్స్ ఇది. `సర్రా సర్రా చూడు.. సుర్రంటుంది కారం.. ఎడా పెడా చూడం ఇది ఎర్రెక్కించే బేరం` అంటూ బ్యాక్ గ్రౌండ్లో తమన్ హోరెత్తిస్తుండగా మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఏందట్టా సూత్తున్నావ్.. బీడీ త్రీడీలో కనపడ్తాందా..’ అంటూ బీడీ పొగల మధ్య మహేష్ ఓ డైలాగ్ వదిలాడు. నిమిషం నిడివి ఉన్న టీజర్ ఇది. మహేష్ అభిమానులకు పండగలా సాగిపోయింది. ఈ గ్లిమ్స్ తో, టైటిల్ తో ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. ఈ ఎలివేషన్లకు ‘అల వైకుంఠపురంలో’ని ‘సిత్తరాల సిరపడు’ పాటే స్ఫూర్తి కావొచ్చు. కానీ అక్కడ బన్నీ.. ఇక్కడ మహేష్. ఎవరి స్టైల్ వారిదే. మహేష్ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే పేరు పెడతారు అనగానే కొంతమంది అనుమానంగా చూశారు. ఈ టైటిల్ మహేష్ కి ఎలా సెట్టవుతుందా? అంటూ కంగారు పడ్డారు. కానీ టీజర్‌తో.. ఈ టైటిల్ మహేష్‌కి యాప్టే అని నిరూపించాడు త్రివిక్రమ్.ఆ రకంగా చూస్తే.. ఈ గ్లిమ్స్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకొన్నట్టే.