హైదరాబాద్: అవును! ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. శ్రీమంతుడు చిత్రం శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన చిన్నతనమంతా చెన్నైలో గడిచిందని, అందుకే స్కూల్లో తెలుగు చదువుకోలేదని చెప్పారు. షూటింగ్ సమయంలో స్క్రిప్ట్‌లోని తన డైలాగులను – దర్శకుడు, సహాయ దర్శకులు చెప్పగా వింటానని, మెమరీద్వారా వాటిని గుర్తుపెట్టుకుని చెబుతానని వెల్లడించారు. మొదటి సినిమానుంచీ ఇదే పద్ధతిలో వెళుతున్నట్లు తెలిపారు. ఇది ఒకరకంగా ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. తన మైండ్‌లో మాడ్యులేషన్ ఏదీ లేదుకాబట్టి ఆ డైలాగ్ సహజంగా, గుండెల్లోనుంచి వస్తుందని అన్నారు. మంచి జ్ఞాపకశక్తి తనకు వరమని, అది తన తండ్రి కృష్ణనుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని, పేజీలకొద్దీ డైలాగులనుకూడా సింగిల్ టేక్‌లో చెప్పేస్తారని తెలిపారు.
సీన్ బాగా రావటంకోసం తాను టేక్‌లు ఎక్కువ తీసుకుంటానని మహేష్ చెప్పారు. జగపతిబాబు తన సీన్లను సింగిల్ టేక్‌లోనే చేయాలని అనుకుంటారని, అయితే తనకోసం ఈ సినిమాలో ఎడ్జస్ట్ అయ్యారని తెలిపారు. తనను వదిలిపెడితే రీటేక్‌లు అలా తీస్తూనే ఉంటానని నవ్వుతూ చెప్పారు. నటులు డాన్సులు చేయకూడదన్న వాదనతో గతంలో తానూ ఏకీభవించేవాడినని, అయితే ఇటీవల డాన్స్‌లపై కొద్దిగా శ్రద్ధ పెడుతున్నానని తెలిపారు.
ఏది ఏమైనా తెలుగు కథానాయకుడై ఉండి, మహేష్‌కు తెలుగు చదవటం రాదంటే తెలుగు భాషాభిమానులు మండిపడే అవకాశముంది. కనీసం ఆ విషయం బయటకు చెప్పకయ్యా బాబూ!