ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్హాను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆయనపై చంద్రబాబుకు మంచి గురి ఉంది. ఆయన ఏపీ క్యాడర్ అయినా ప్రస్తుతానికి కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఏపీకి పంపాలని చంద్రబాబు కోరడంతో కేంద్రం అంగీకరించింది. ఆయన ఏపీలో రిపోర్టు చేయనున్నారు. ఆయనకు చంద్రబాబు కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు హయాంలో లడ్హా కీలక బాధ్యతల్లో ఉన్నారు. జగన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడినప్పుడు విశాఖ కమిషనర్ ఆయనే. అప్పుడు మొత్తం కుట్రను నిర్వీర్యం చేసి.. నిజాలను బయట పెట్టారు. ఆ కోపం జగన్ కు ఉంది. అయితే తర్వాత లడ్హా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఆయనను ఏపీకి రప్పించుకుంటున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ప్రస్తుతం ఈసీ నియమించిన అధికారే ఉన్నారు. చంద్రబాబు మార్చలేదు. లడ్హా కోసమే ఇంకా ఎలాంటి నియామకం చేయలేదని భావిస్తున్నారు.
ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్ పాత్ర కీలకం. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు చేశారు.. కానీ ఆయన పరిస్థితి .. తన సర్వీస్‌లో చివరి ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో సీతారామాంజనేయులు చేసిన పనులు బయటకు తెలిసింది ఓ పది శాతమే… అందుకే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు లడ్హా ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే లడ్హా పోలీసింగ్ మిగతా వారిలా ఉండదని.. ఆయన చట్ట ప్రకారం అంతా పర్ ఫెక్ట్ గా చేస్తారని టీడీపీ వర్గాలంటున్నాయి.