హైదరాబాద్: బాహుబలి చిత్రానికి మరో సెలబ్రిటీ ప్రశంశలు లభించాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబు బాహబలి చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు. స్విట్జర్లాండ్‌నుంచి ఇప్పుడే తిరిగొచ్చానని, బాహుబలి ప్రభంజనం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒక తెలుగు సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రికార్డులు సృష్టిస్తుందని తానెప్పుడూ ఊహించలేదని, ఇది గర్వకారణమని వ్యాఖ్యానించారు. రాజమౌళి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినవారవటం గర్వకారణమని ట్వీట్ చేశారు. ప్రభాస్‌ను, రానాను, కీరవాణిని, నిర్మాతలను అభినందించారు.
మహేష్ తదుపరి చిత్రం శ్రీమంతుడు వాస్తవానికి బాహుబలి విడుదలైన వారంరోజుల తర్వాత జులై 17న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అర్కా ఫిలిమ్స్ అధినేతల కోరిక మేరకు ఆ చిత్రాన్ని ఆగస్టు 7కు వాయిదా వేశారు. రాజమౌళి – మహేష్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ త్వరలో ఒక చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రం బాహుబలి – 2 పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.