‘సరిలేరు నీకెవ్వరు’ తరవాత మహేష్‌బాబు సినిమాలేమిటి? ఎవరితో? అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఆ తరవాత వంశీపైడిపల్లి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ విషయంపై మహేష్ క్లారిటీ ఇచ్చాడు. “వంశీ పైడిపల్లి సినిమానే ముందుగా మొదలవుతుంది. ఈసారి మేం కమర్షియల్ సినిమా చేయబోతున్నాం. సందేశాత్మక కథలకు కొంత బ్రేక్ ఇస్తున్నామ”న్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఇటీవల మహేష్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందని అనుకున్నారు. వీటిపై కూడా మహేష్ స్పష్టత ఇచ్చాడు. “ప్రశాంత్ నీల్ని కలుసుకున్న మాట నిజమే. ఆయనకొన్ని లైన్లు కూడా చెప్పారు. కానీ అవి వర్కవుట్ అవుతాయే లేదో ఇప్పుడే చెప్పలేను” అన్నాడు. తనకు అనిల్ రావిపూడితో మళ్లీ మళ్లీ పనిచేయాలనివుందని, తన ఎనర్జీ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు మహేష్. తన అంచనాల మేరకు ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి ఫలితాన్ని అందుకుంటే మాత్రం కచ్చితంగా ఈ కాంబోలో మరో సినిమా ఉండొచ్చు.