కిడ్నాప్ డ్రామా చుట్టూ కథలు నడపడం అంటే నవతరం దర్శకులకు ఎంత మక్కువో. సస్పెన్స్ థ్రిల్లర్ అనగానే వాళ్లకు కిడ్నాప్ డ్రామా గుర్తొస్తుంది. కిడ్నాప్ అంటేనే బోల్డంత సస్పెన్స్… థ్రిల్. అందుకే వాటిపై మోజు పెంచుకొంటారేమో?? ఇప్పుడు మరో కిడ్నాప్ కథ తెరకెక్కబోతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కిడ్నాప్ చేయబోతున్నార్ట. ‘పెసరెట్టు’తో దర్శకుడిగా తొలి అడుగు వేసిన సినీ విమర్శకుడు మహేష్ కత్తి.. ఈసారి చంద్రబాబు నాయుడుని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌పై ఓ కథ రెడీ చేసుకొన్నారని సమాచారం. నలుగురు కుర్రాళ్లు కలసి సీఎమ్ కిడ్నాప్‌కి ప్లాన్ చేస్తారట. ఆ తరవాత ఏమైందో.. తెరపై చూడాలంటున్నారాయన.
మహేష్ కత్తికి సినీ విమర్శకుడిగా మంచి పేరుంది. అయితే దర్శకుడిగా మారి తీసిన.. పెసరెట్టు దారుణంగా బెడసి కొట్టింది. విమర్శించినంత ఈజీకాదు ఓ సినిమా తీయడం.. అంటూ మహేష్ పై చాటుమాటుగా సెటైర్లు వేశారంతా. అందుకే ఈసారి పకడ్బందీ స్ర్కిప్టుతో వస్తున్నాడట. క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ సినిమా తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.