రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనుకుని… హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన కత్తి మహేష్.. ఇప్పుడు విజయవాడకు మకాం మార్చారు. హైదరాబాద్ నుంచి పోలీసులు ఆయనను చిత్తూరు జిల్లాలోని స్వగ్రామంలో విడిచి పెట్టారు. అక్కడ కూడా ఆయన ప్రెస్మీట్ పెట్టాలనుకుంటే.. పోలీసులు తీసుకెళ్లి బెంగళూరులో విడిచి పెట్టారు. అప్పట్లో.. ఒకటి, రెండు సందర్భాల్లో సోషల్ మీడియాలో కనిపించిన ఆయన… ఆ తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా విజయవాడలో ఊడిపడ్డారు. ఇక తాను విజయవాడలోనే ఉండబోతున్నట్లు ప్రకటించారు. దానికి చాలా పెద్ద పెద్ద సెంటిమెంట్ డైలాగులు కూడా చెబుతున్నారు. తనను హైదరాబాద్ నుంచి మాత్రమే పోలీసులు బహిష్కరించారని చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడైనా ఉండవచ్చని…కానీ తాను ఆంధ్రప్రదేశ్ వాసిని కాబట్టి.. విజయవాడలోనే ఉంటానంటున్నారు.
హైదరాబాద్ పోలీసులు తనను నగర బహిష్కరణ చేసి.. తన జీవనోపాధిని దెబ్బతీశారని ఆయన చెప్పుకొస్తున్నారు. నగర బహిష్కరణ అంటే.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటున్నారు. ప్రస్తుతం తాను హైకోర్టులో పోరాడుతున్నానని..కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటానంటున్నారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా చెబుతున్నారు. అంతకు ముందు సినీ విమర్శకుడిగా.. కొద్ది మందికి మాత్రమే తెలిసిన మహేష్ .. బిగ్ బాస్ తొలి సీజన్లో… ఓ కంటెస్టెంట్గా ఎంపికై.. గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతో పాటు.. తన సహజసిద్ధమైన వివాదాస్పద స్టేట్మెంట్లు..వాటితో టీఆర్పీ పంట పండించుకునేందుకు చానాళ్లు… పోటీ పడటంతో.. ఆయన సెలబ్రిటీ అయిపోయారు. జనసేన అధినేతను చాలా రోజుల పాటు తనతో సహా వార్తల్లో ఉంచారు. ఆ సమయంలో ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ ఏర్పాటు చేసిన నిరసనలోనూ పాల్గొన్నారు. నగర బహిష్కరణకు గురవడానికి కొద్ది రోజుల ముందు.. జగన్ను కలిసి… వైసీపీలోచేరుతానని.. చిత్తూరు లేదా.. తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఉందని చెప్పుకున్నారు.
అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. కత్తి మహేష్ లాంటి సానుభూతి పరుడ్ని వదులుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలే.. ఖర్చులు భరిచి విజయవాడలో ఆయన బసకు ఏర్పాట్లు చేశారన్న ప్రచారం జరుగుతోంది. సహజంగా వైసీపీ మద్దతు దారుడు. అపరిమితమైన… భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని నమ్మే రకం… అంతకు మించి వారేకం కావాలి. ఆయన ఏదో ఓ వివాదం రేపకపోతాడా.. దాన్నుంచి రాజకీయం పిండుకోకపోతామా..అన్నది వైసీపీ నేతల ఆలోచన కావొచ్చు. కానీ కత్తి మహేష్ మాత్రం.. తాను రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నారు. వైసీపీ ఏం చెప్పినా చేసి.. టిక్కెట్ పొందాలనుకుంటున్నారు. మరి జగన్ దగ్గర అది సాధ్యమవుతుందా..?