మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా కోసం కొన్ని టైటిళ్లు ఇప్పటికే బయటకువచ్చాయి. ఎనిమి, జస్టిస్ అని అనుకొన్నారు. కానీ అవేం కాదని తేలిపోయింది. ఈమధ్య వాస్కోడా గామా అనే మరో టైటిల్ వార్తల్లోకి వచ్చింది. మురుగదాస్ సినిమా టైటిళ్లన్నీ వెరైటీగా ఉంటాయి కదా అని.. వాస్కోడ గామా టైటిల్ ఫిక్సయిపోయిందని జనం అనుకొన్నారు. కానీ.. ఇదీ కాదట. ఈ సినిమా కోసం ఇంకా టైటిల్ ఏదీ అనుకోలేదని, బయట ప్రచారంలో ఉన్న టైటిళ్లేవీ నిజం కాదని చిత్రబృందం ప్రకటించింది. జులై 15 నుంచి చిత్రీకరణ ప్రారంభించుకొంటున్న ఈ చిత్రానికి పరిణితి చోప్రా కథానాయిక.
ఇతర సాంకేతిక నిపుణులు కూడా దాదాపుగా ఖరారైపోయారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తారు. తమిళంలో మహేష్ బాబునే డబ్బింగ్ చెప్పుకొంటాడట. మహేష్‌కి తమిళం బాగా వచ్చు. చిన్నప్పుడు అక్కడే పెరిగాడు. అందుకే… తమిళంలో డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే కథ ఇదని ప్రచారం జరిగింది. అందులోనూ నిజం లేదట. మరి ఈ సినిమా కథేంటో, టైటిల్ ఏంటో.. ఈ విషయాలపై మురుగదాస్ ఎప్పుడు నోరు విప్పుతాడో?