హైదరాబాద్: సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంలో మహేష్‌ను తీసుకోవాలని యోచిస్తున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వాస్తవానికి మణిరత్నం కార్తి, దుల్కర్ సల్మాన్ హీరోలుగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. డిసెంబర్ నెలలో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రాన్ని మణిరత్నం తమిళ్, తెలుగు భాషలలో ద్విభాషాచిత్రంగా రూపొందించాలని భావించారు. అయితే దుల్కర్‌కు తెలుగులో, తమిళ్లో మార్కెట్ లేదుకాబట్టి అతను వద్దని నిర్మాతలు మణిరత్నంపై ఒత్తడి తెస్తున్నట్లు సమాచారం. దీనితో దుల్కర్‌ను తొలగించి ఆయన స్థానంలో మహేష్‌బాబును తీసుకోవాలని మణిరత్నం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వార్తకు బలం చేకూర్చేవిధంగా దుల్కర్ తన తదుపరి డేట్లన్నీ దర్శకులు రాజీవ్ రవి, ప్రతాప్ పోతన్ రూపొందించే ఇతర చిత్రాలకు కేటాయించినట్లు సమాచారం వెలుగులోకొచ్చింది. దీనినిబట్టి అతను మణిరత్నం చిత్రంలో లేనట్లేనని నిర్ధారణ అయ్యింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మణిరత్నం చిత్రం వాయిదాపడే అవకాశం ఉందనికూడా కోలీవుడ్ సమాచారం. వాస్తవానికి మణిరత్నం ఈ చిత్రానికి కార్తి, దుల్కర్లతోపాటు నిత్యమీనన్, కీర్తి సురేష్లను హీరోయిన్లుగా తీసుకున్నారు. సంగీతానికి ఏఆర్ రెహ్మాన్, ఫోటోగ్రఫీకి రవి వర్మన్‌లను బుక్ చేశారు. మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ – మణిరత్నం గత చిత్రం ‘ఓకే బంగారం’ చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
మహేష్ మణిరత్నం ప్రతిపాదనకు ఏమంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమయింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ఒక ప్రాజెక్ట్ ప్రారంభమవ్వాల్సి ఉన్నప్పటికీ అది ఎందుకనో పట్టాలపైకెక్కలేదు. మణిరత్నంతో చేయటం తన కల అని, ముందుముందైనా అది సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్లు మహేష్ అప్పట్లో చెప్పారు. మరి ఇప్పుడు మణిరత్నం ప్రతిపాదనకు ఓకే చెప్పటానికి మహేష్‌కు డేట్స్ ఖాళీగా ఉన్నాయో లేదో!