తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావు, ఇక్కడ ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువ, బాలీవుడ్ హీరోలకే అది సాధ్యం….ఇలాంటి మాటలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మన హీరోలు ముందడుగు వేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల టైంకి ముందు మన తెలుగులో కూడా రెగ్యులర్‌గా మల్టీ స్టారర్ సినిమాలు వచ్చేవి. అయితే ఆ నలుగురూ మాత్రం ఎందుకనో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ హీరోల గొప్పలను ప్రూవ్ చేయడం కోసం ఒకరితో ఒకళ్ళు గొడవపడుతున్న అభిమానుల మధ్య సయోధ్య కోసం కూడా ఈ హీరోలు పెద్దగా ప్రయత్నాలు చేసినట్టు కనిపించదు. రీసెంట్గా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌కి చిరంజీవి అటెండ్ అవడం, బాలకృష్ణ గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం మాత్రం బాగుంది.
మహేష్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు మాత్రం అందరు హీరోల గురించి మంచిగా మాట్లాడుతున్నారు. అభిమానులకు కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని అభిమానుల మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉంటున్నాయన్న విషయం ఈ హీరోలకు కూడా ప్రత్యక్షంగా తెలుస్తోంది. మోరోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అభిమానులు నేలబారు ప్రేక్షకులకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వేరే హీరో ఫ్యాన్స్‌ని హర్ట్ చేయడమే టార్గెట్ అన్నట్టుగా తమ క్రియేటివిటీ మొత్తం చూపిస్తున్నారు. అయితే హీరోలు మాత్రం ప్యాన్స్ మధ్య విభేదాలు తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడం అభినందించాల్సిన విషయం. సూపర్ స్టార్ మహేష్ గ్లామర్‌ని చాలా సార్లు మెచ్చుకున్న రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా మహేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పాడు.
మిగతా హీరోలందరికంటే కూడా ఈ విషయంలో మహేష్ బాబు చాలా ముందున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకు, ఎన్టీఆర్ బాద్షా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ ఆ హీరోల అభిమానులను కూడా మెప్పించాడు. అలాగే అల్లు అర్జున్ కూడా ప్రభాస్‌తో పాటు మిగతా హీరోలతో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నిహారిక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడినప్పుడు కూడా వేరే హీరోల సినిమా ఫంక్షన్స్‌లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్‌కి కొంచెం కటువుగానే చెప్పాడు బన్నీ. అలాగే ఎన్టీఆర్ కూడా మెగా హీరోలతో పాటు మహేష్ గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ తర్వాత స్థాయిలో ఉన్న స్టార్స్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌లు మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ముందుకు రావడం కూడా శుభపరిణామమే. నిజానికి వీళ్ళందరికంటే కూడా సాయిధరమ్ తేజ్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నాడు. ఆ మధ్య నారా రోహిత్, నందమూరి తారకరత్నలు కలిసి నటించిన సినిమాకు మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆల్ ద బెస్ట్ చెప్పడం విశేషం.
ఈ స్టార్స్ అందరూ కూడా తోటి స్టార్స్ విషయంలో ఎంతో కొంత పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ ఉండడం బాగుంది. అయితే అందరూ కూడా గొడవలు పడుతున్న ఫ్యాన్స్‌కి క్లియర్‌గా అర్థమయ్యేలా ఇంకా ఎక్కువగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే స్థాయిలో ఉంటే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది. అసలే సినిమా బడ్జెట్స్ భారీగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంట్ అవుతున్నాడు. మోరోవర్ ఈ స్టార్స్ సినిమాలకు రివ్యూలు ఎంత నష్టం చేస్తున్నాయో తెలియదు కానీ తోటి స్టార్స్ అభిమానులు మాత్రం చాలా చాలా నష్టం చేస్తున్నారు. సర్దార్, బ్రహ్మోత్సవం సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇరువురు హీరోల ఫ్యాన్స్ కూడా ఎంత వరస్ట్‌గా రియాక్ట్ అయ్యారో…ఆ సినిమాలు చచ్చిపోవాలన్న కసితో ఏ స్థాయిలో కష్టపడ్డారో కళ్ళారా చూశాం. అలాంటి పరిస్థితి ఏ స్టార్ హీరోకి కూడా మంచిది కాదు. అలాంటి విపరీత మనస్థత్వం నుంచి అభిమానులు బయటపడాలన్నా, వేరే హీరోలను శతృవులుగా చూసే పరిస్థితి మారాలన్నా హీరోలే ముందుకు రావాలి. ఒకరి సినిమా ఆడియో రిలీజ్‌లకు ఒకళ్ళు అటెండ్ అవడం, తోటి హీరోల సినిమాలు హిట్ అయినప్పుడు అబిమానులకు కూడా తెలిసేలా ఆ హీరోలను అభినందించడం లాంటి యాక్టివిటీస్ చేయాలి. రామ్ చరణ్ తేజ్..మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పడం, సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్‌లు కలిసి నటించాలనుకోవడం చాలా చాలా బాగుంది. ఇలాంటి వార్తలు ఇంకా ఇంకా వినిపిస్తూ ఉంటే అభిమానుల్లో కూడా మార్పు వస్తుంది. ఆ పరిణామం తెలుగు సినీ పరిశ్రమకు చాలా చాలా మంచి చేస్తుందనడంలో సందేహం లేదు.