చిత్రసీమ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు – రాజమౌళి. పదేళ్ల క్రితం నుంచీ ఈ కాంబోపై వార్తలు వస్తూనే ఉన్నాయి. `చేద్దాం.. చేద్దాం` అని అటు రాజమౌళి, ఇటు మహేష్ చెబుతూనే వచ్చారు. ఎట్టకేలకు అది ఓకే అయ్యింది. `మహేష్ తో సినిమా చేస్తున్నా. నా నెక్ట్స్ ప్రాజెక్టు అదే` అంటూ రాజమౌళి చెప్పడంతో మహేష్ అభిమానుల్లో ఆనందం ఉరకలెత్తుతోంది. అయితే మహేష్‌ని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు, ఎలాంటి కథతో రాబోతున్నాడు? అనే ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి కూడా.
పదేళ్ల క్రితం… మహేష్, రాజమౌళి కాంబో రావాల్సింది. అప్పుడే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ మహేష్ తన కమిట్స్‌మెంట్స్ వల్ల అప్పుడు చేయలేకపోయాడు. ఆ తరవాత కూడా సినిమా ఆశలు చిగురించినా, కూర్చుని కథ గురించి చర్చించేంత అవకాశం రాలేదు. కానీ పదేళ్ల క్రితం మహేష్‌కి స్పై థ్రిల్లర్ వినిపించాడట. జేమ్స్ బాండ్ లాంటి కథ అది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఆలోచించడం మొదలెట్టాడు. తెలుగు మార్కెట్ స్థాయి పెరిగింది. అందుకే అప్పటితో పోలిస్తే ఆ కథని ఇప్పుడు తీయడమే బెటర్. `ఆర్.ఆర్.ఆర్` ప్రారంభ ప్రెస్ మీట్లో మహేష్ తో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎందుకు చేయించట్లేదు? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నిస్తే – `మహేష్‌ని జెమ్స్ బాండ్ తరహా పాత్రలో చూపించాలనివుంది` అంటూ ఓ హింట్ కూడా ఇచ్చాడు. సో.. ఈసారి మహేష్ కోసం రాజమౌళి అలాంటి కథే రాసి ఉంటాడన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఈలోపు రాజమౌళి ఆలోచనల్లో భారీ మార్పులొస్తే తప్ప – మహేష్ తో రాజమౌళి జేమ్స్‌బాండ్ తరహా సినిమా తీయడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.